Sujit Bangar: ఐటీఆర్ ఫైలింగ్ మర్చిపోయారా?.. నో ప్రాబ్లం.. ఇవిగో మూడు మార్గాలు!

ITR Filing Options After Deadline Explained by Sujit Bangar
  • డిసెంబర్ 31 వరకు బిలేటెడ్, రివైజ్డ్ రిటర్న్ దాఖలుకు అవకాశం
  • చివరి అస్త్రంగా ఐటీఆర్-యూ.. కానీ అత్యంత ఖరీదైనది
  • పొరపాటు చేస్తే 70 శాతం వరకు అదనపు పన్ను చెల్లించాల్సి రావచ్చు
  • ఐటీఆర్-యూను చివరి అవకాశంగానే చూడాలంటున్న నిపుణులు
  • ఆలస్యమైనా రిటర్న్ వేయడమే మేలని పన్ను నిపుణుల సూచన
ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును మీరు మిస్ అయ్యారా? లేదా మీ ఆదాయ వివరాల్లో ఏదైనా పొరపాటు దొర్లిందా? కంగారు పడకండి, మీ ముందు ఇంకా మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఒక మార్గం చాలా ఖరీదైనది. దానిని ఎంచుకుంటే ఏకంగా 70 శాతం వరకు అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుందని పన్ను నిపుణుడు, టాక్స్‌బడ్డీ.కామ్ ప్రతినిధి సుజిత్ బంగర్ హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలను ఆయన తన లింక్డ్‌ఇన్ పోస్టులో పంచుకున్నారు.

గడువు ముగిసిన తర్వాత పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండే మూడు మార్గాల గురించి సుజిత్ బంగర్ స్పష్టంగా వివరించారు. అవి: బిలేటెడ్ రిటర్న్, రివైజ్డ్ రిటర్న్, ఐటీఆర్-యూ (అప్‌డేటెడ్ రిటర్న్).

అత్యంత ఖరీదైన ఐటీఆర్-యూ
బిలేటెడ్, రివైజ్డ్ రిటర్న్‌ల గడువు కూడా ముగిసినప్పుడు లేదా గతంలో చూపని ఆదాయాన్ని వెల్లడించాల్సి వచ్చినప్పుడు ఐటీఆర్-యూను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ యాక్ట్ 2025 ప్రకారం దీనిని 48 నెలల వరకు దాఖలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దీనికి భారీగా జరిమానాలు ఉంటాయి. చెల్లించాల్సిన అసలు పన్ను, వడ్డీ మొత్తంపై 25 శాతం నుంచి 70 శాతం వరకు అదనపు పన్ను విధించవచ్చు. అందుకే "ఐటీఆర్-యూను పన్ను ప్రణాళికలో భాగంగా కాకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో చివరి అస్త్రంగా మాత్రమే చూడాలి" అని బంగర్ గట్టిగా సూచించారు. దీని ద్వారా పన్ను తగ్గించుకోవడం, నష్టాలను ప్రకటించడం లేదా రీఫండ్ క్లెయిమ్ చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

బిలేటెడ్, రివైజ్డ్ రిటర్న్‌లు

ఇక మొదటి ఆప్షన్, సెక్షన్ 139(4) కింద దాఖలు చేసే బిలేటెడ్ రిటర్న్. దీనిని సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌లో డిసెంబర్ 31 వరకు ఫైల్ చేయవచ్చు. దీనికి ఆలస్య రుసుము ఉంటుంది. ఆదాయం రూ. 5 లక్షలు దాటితే రూ. 5,000, అంతకంటే తక్కువ ఉంటే రూ. 1,000 చెల్లించాలి. దీంతో పాటు సెక్షన్ 234ఏ కింద వడ్డీ కూడా వర్తిస్తుంది. కొన్ని రకాల నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే అవకాశం కోల్పోతారు. అయినప్పటికీ, టీడీఎస్/టీసీఎస్ క్రెడిట్లను పొందడానికి, ఐటీఆర్-యూ వంటి భారీ జరిమానాల బారిన పడకుండా ఉండటానికి ఆలస్యమైనా రిటర్న్ ఫైల్ చేయడమే మంచిదని బంగర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే రిటర్న్ దాఖలు చేసి, అందులో తప్పులు గమనించిన వారు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. బిలేటెడ్ రిటర్న్‌ను కూడా రివైజ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి కూడా డిసెంబర్ 31 ఆఖరు తేదీ. కాబట్టి పన్ను చెల్లింపుదారులు తమ పరిస్థితిని బట్టి వీలైనంత త్వరగా స్పందించి, సరైన మార్గాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Sujit Bangar
ITR filing
Income Tax Return
Belated Return
Revised Return
ITR-U
Updated Return
TaxBuddy
Tax planning
Income tax

More Telugu News