Rammohan Naidu: ఇక విమాన ప్రయాణం సామాన్యుడి సొంతం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Number of air travellers surges to about 25 crore in 2025 Says Ram Mohan Naidu
  • 11 ఏళ్లలో 11 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగిన విమాన ప్రయాణికులు
  • దేశవ్యాప్తంగా 'యాత్రి సేవా దివస్ 2025'ను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు
  • విమానయానం ఉన్నత వర్గాల నుంచి సామాన్యులకు చేరిందని వెల్లడి
  • త్వరలోనే అన్ని విమానాశ్రయాల్లో వైఫై సదుపాయం కల్పిస్తామని హామీ
  • ఉడాన్ పథకంతో విమాన ప్రయాణం మరింత అందుబాటులోకి వచ్చిందన్న మంత్రి
దేశ విమానయాన రంగం గత 11 ఏళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య, 2025 నాటికి 25 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. ఇది విమానయాన రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

యూపీలోని ఘజియాబాద్, హిండన్ విమానాశ్రయంలో దేశవ్యాప్త 'యాత్రి సేవా దివస్ 2025' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు, అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. "గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి 'ప్రధాన సేవకుడిగా' పాలన స్వరూపాన్నే మార్చేశారు. ప్రజాసేవకే పెద్దపీట వేశారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా భావిస్తున్నాం" అని రామ్మోహన్ నాయుడు అన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి వివరించారు. 'ఉడాన్' వంటి పథకాల ద్వారా విమాన ప్రయాణం చౌకగా, సులభంగా మారిందన్నారు. దీనికి ఉదాహరణగా హిండన్ విమానాశ్రయాన్ని ఆయన ప్రస్తావించారు. 2020లో కేవలం ఒకే ఒక్క విమాన సర్వీసు ఉన్న ఇక్కడి నుంచి ఇప్పుడు దేశంలోని 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయని తెలిపారు.

'డిజిటల్ ఇండియా మిషన్'లో భాగంగా అతి త్వరలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ పునాదులపై వికసిత భారత్ నిర్మించడమే లక్ష్యమని, దీనికోసం విమానయాన రంగంలోని భాగస్వాములందరూ స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
Rammohan Naidu
civil aviation
aviation sector growth
UDAN scheme
air travel
passenger services
Hindon Airport
digital India
Atmanirbhar Bharat
Viksit Bharat

More Telugu News