Donald Trump: అమెరికా డ్రగ్స్ జాబితాలో భారత్.. సంచలన నివేదిక విడుదల చేసిన ట్రంప్

Trump Names India Pakistan 21 Other Countries As Major Drug Transits
  • మాదకద్రవ్యాల రవాణా దేశాల జాబితా విడుదల చేసిన అమెరికా
  • మొత్తం 23 దేశాల పేర్లను అధికారికంగా ప్రకటించిన ట్రంప్
  • ఈ జాబితాలో భారత్, చైనా, పాకిస్థాన్ పేర్లకు చోటు
  • జాబితాలో ఉండటం ప్రభుత్వ వైఫల్యం కాదని అమెరికా వివరణ
  • కొన్ని దేశాలు డ్రగ్స్ నియంత్రణలో విఫలమయ్యాయని వెల్లడి
మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న దేశాల జాబితాను అమెరికా విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అధికారిక నివేదికలో మొత్తం 23 దేశాల పేర్లను వెల్లడించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ జాబితాలో భారత్‌తో పాటు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా కూడా ఉన్నాయి. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ జాబితాలో ఉన్న ఇతర దేశాలలో మెక్సికో, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్, పెరూ, పనామా, కోస్టారికా, జమైకా, లావోస్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఒక దేశం పేరు ఉండటం అనేది ఆ దేశ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచించదని అమెరికా తన నివేదికలో స్పష్టం చేసింది. భౌగోళిక, వాణిజ్య, ఆర్థిక కారణాల వల్ల కొన్ని దేశాలు మాదకద్రవ్యాల రవాణాకు అనుకూలంగా మారతాయని, అందుకే వాటిని ఈ జాబితాలో చేర్చినట్లు వివరించింది. ఆయా ప్రభుత్వాలు డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.

అదే సమయంలో గత 12 నెలలుగా మాదకద్రవ్యాల నియంత్రణ ఒప్పందాలను పాటించడంలో, చర్యలు తీసుకోవడంలో "దారుణంగా విఫలమైన" దేశాలుగా ఆఫ్ఘనిస్థాన్, బొలీవియా, బర్మా, కొలంబియా, వెనిజులా పేర్లను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పనితీరును భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రశంసించడం గమనార్హం. ఓ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఎన్‌సీబీ ఛేదించిన నేపథ్యంలో "అక్రమ మాదకద్రవ్యాల నుంచి అమెరికన్లను రక్షించడంలో, వారి ప్రాణాలను కాపాడటంలో సహాయం చేస్తున్నందుకు భారత ఎన్‌సీబీకి ధన్యవాదాలు" అని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా జాబితాలో భారత్ పేరు రావడం చర్చనీయాంశంగా మారింది.
Donald Trump
United States
India
drugs
narcotics
China
Pakistan
Afghanistan
narcotics control

More Telugu News