Maheshwari: అజిత్ అంటే పిచ్చి ప్రేమ.. కానీ ఆయన ఒక్క మాటతో షాకయ్యా: మహేశ్వరి

Maheshwaris Crush on Ajith Kumar Revealed
  • తమిళ హీరో అజిత్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టిన మహేశ్వరి
  • మనసులో మాట చెప్పాలనుకునే లోపే ఊహించని అనుభవం
  • నువ్వు నా చెల్లెలు లాంటి దానివన్న అజిత్
  • జగపతి బాబు హోస్ట్ చేస్తున్న షోలో పాత జ్ఞాపకాల వెల్లడి
  • దీంతో తన ప్రేమకథ మొదలవకముందే ముగిసిపోయిందన్న నటి
తమ అభిమాన నటులపై ప్రేమను పెంచుకోవడం సహజం. కానీ ప్రేమను వ్యక్తపరిచేలోపే ఎదుటివారి నుంచి ఊహించని మాట వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి అనుభవమే తన జీవితంలో జరిగిందని సీనియర్ నటి, ‘గులాబి’ ఫేమ్ మహేశ్వరి తాజాగా వెల్లడించారు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌పై తనకున్న ప్రేమను బయటపెట్టేలోపే, ఆయన తనను చెల్లెలు అని పిలిచి షాకిచ్చారని ఆమె పాత జ్ఞాపకాలను పంచుకున్నారు.

జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో మహేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను తమిళ హీరో అజిత్‌కు పెద్ద అభిమానినని, ఆయనతో కలిసి ‘ఉల్లాసం’, ‘నీసమ్’ అనే రెండు చిత్రాల్లో నటించానని తెలిపారు. ఆ సమయంలో ఆయనపై తనకు విపరీతమైన క్రష్ ఏర్పడిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

"రెండో సినిమా చిత్రీకరణ ఆలస్యం కావడంతో అజిత్‌తో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. నా మనసులోని మాట ఆయనకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ధైర్యం సరిపోలేదు. షూటింగ్ చివరి రోజున, ఇక ఆయనతో సమయం గడిపే అవకాశం ఉండదని చాలా బాధపడ్డాను. నా దిగులును గమనించిన అజిత్ నా దగ్గరికి వచ్చారు" అని మహేశ్వరి వివరించారు. 

ఆ సమయంలో అజిత్ తనతో, "నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు చెప్పు" అని అన్నారని మహేశ్వరి తెలిపారు. ఆ మాట వినగానే తాను షాక్‌కు గురయ్యానని, దాంతో తన ప్రేమను ఇక ఎప్పటికీ వ్యక్తపరచలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. అలా తన ప్రేమకథ మొదలవకముందే ముగిసిపోయిందని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. మహేశ్వరి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Maheshwari
actress Maheshwari
Ajith Kumar
Ajith
Ullasam movie
Neesam movie
Jayammmu Nischayammura
Jagapathi Babu
Tamil cinema
Telugu actress

More Telugu News