AP Weather: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

Heavy Rains Expected in AP IMD Issues Thunderstorm Warning
  • ఏపీపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణుల ప్రభావం
  • రానున్న 24 గంటల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
  • పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరిక
  • రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ కుండపోత
  • బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలకు అవకాశం
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం, గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. అలాగే కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ కూడా రాయలసీమలో అనేకచోట్ల, కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అక్కడక్కడా కుండపోత వానలు కురవవచ్చని అంచనా వేసింది.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అదేవిధంగా, దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్‌ ప్రాంతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ కారణాల వల్లే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిన్న‌ ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4 సెం.మీ., విజయనగరం జిల్లా రాజాంలో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలోనూ వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది అల్పపీడనంగా మారుతుందా లేదా అనే దానిపై త్వరలో స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. అనంతరం ఈ నెల 26 లేదా 27న మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడుతుందని, ఇది మరింత బలపడే అవకాశం ఉందని వారు అంచనా వేశారు.
AP Weather
Andhra Pradesh rains
heavy rainfall warning
IMD forecast
thunderstorms Nellore
Chittoor weather
Rayalaseema rains
coastal Andhra
cyclone update
weather forecast

More Telugu News