Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత... గంటల తరబడి ట్రాఫిక్‌లో తీవ్ర అవస్థలు

Hyderabad Rains Heavy Rainfall Causes Traffic Jams
  • రోడ్లపై నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌
  • మియాపూర్‌లో అత్యధికంగా 9.7 సెం.మీ. వర్షపాతం నమోదు
  • బంగాళాఖాతంలో అల్పపీడనమే కారణమన్న వాతావరణ శాఖ
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక
 భాగ్యనగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలతో పాటు సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అనేక చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా మియాపూర్‌లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత లింగంపల్లిలో 8.2 సెం.మీ., హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో 8.1 సెం.మీ., గచ్చిబౌలిలో 6.6 సెం.మీ., చందానగర్‌లో 6.4 సెం.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను చేపట్టాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Hyderabad Rains
Hyderabad
Telangana rains
Heavy rainfall
Traffic jam
Miyapur
Gachibowli
Weather updates
GHMC
IMD

More Telugu News