Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో.. ఎల్&టీకి గుడ్ బై చెప్పనున్న ప్రభుత్వం?

Hyderabad Metro LT exit Telangana government considers proposal
  • రూ. 6 వేల కోట్లు ఇస్తే మెట్రో నుంచి వైదొలుగుతామన్న ఎల్&టీ
  • ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • అప్పులు, నష్టాల భారమే కారణమంటున్న సంస్థ
  • ఆస్తుల నిర్వహణలో ఎల్&టీ విఫలమైందని ప్రభుత్వ భావన
  • రెండో దశతో పాటు మొదటి దశను కూడా నడిపేందుకు సర్కార్ యోచన
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణపై ఎల్&టీ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని, తమకు రూ. 6,000 కోట్లు చెల్లిస్తే చాలని ఎల్&టీ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనం రేపుతోంది. పదేపదే నష్టాల మాట చెబుతున్న సంస్థ వైఖరితో విసిగిపోయిన ప్రభుత్వం, ఈ ప్రతిపాదనపై తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

గత కొంతకాలంగా మెట్రో నిర్వహణ లాభదాయకంగా లేదని, అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయిందని ఎల్&టీ అంతర్గతంగా ప్రభుత్వానికి తెలుపుతూనే ఉంది. అయితే, మొదటి దశలో సంస్థకు అప్పగించిన ఆస్తులను సరిగ్గా నిర్వహించడంలో విఫలమైందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో బలంగా ఉంది. దీనికి తోడు మెజారిటీ స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం కూడా ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ఓ కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రెండో దశ విస్తరణను పూర్తిగా ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా వ్యయంతో భారీ విస్తరణకు సిద్ధమవుతున్న తరుణంలో, మొదటి దశ బాధ్యతలను కూడా స్వీకరించడం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్&టీ వైదొలగాలని నిర్ణయించుకుంటే, దానికి అంగీకరించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.

రెండు దశల మధ్య సమన్వయం, అనుసంధానం సజావుగా సాగాలంటే మొత్తం ప్రాజెక్టు ఒకే గొడుగు కింద ఉండటం మేలని ప్రభుత్వంలో చర్చ నడుస్తోంది. దేశంలోని ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రభుత్వాలే మెట్రోలను నిర్వహిస్తున్నాయి. కొన్నిచోట్ల నష్టాలు వస్తున్నా, వాటిని ప్రజా రవాణా సేవలో భాగంగానే చూస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోను కూడా నడిపేందుకు అవసరమైతే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రభుత్వం తమంతట తాముగా ఈ ప్రతిపాదన చేయకుండా, ఎల్&టీ నుంచి ఒత్తిడి వస్తే మాత్రం అందుకు పచ్చజెండా ఊపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Hyderabad Metro
L&T
Telangana government
Metro Rail project
Revanth Reddy
Hyderabad Metro expansion
Public transportation
Delhi Metro
Bangalore Metro
Chennai Metro

More Telugu News