Mukesh Ambani: ప్రధాని నరేంద్ర మోదీకి ముఖేశ్ అంబానీ బర్త్ డే విషెస్.. ఆసక్తికర వ్యాఖ్యలు

Mukesh Ambani Birthday Wishes to PM Narendra Modi Interesting Comments
  • ప్రధాని నరేంద్ర మోదీకి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ముఖేశ్ అంబానీ
  • స్వాతంత్య్ర భారతావనికి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి కూడా మోదీయే ప్రధానిగా ఉండాలని ఆకాంక్ష
  • దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌గా మారుస్తున్నారంటూ ప్రశంస
  • మోదీ నాయకత్వ పటిమను కొనియాడిన ఉదయ్ కోటక్, సునీల్ మిట్టల్, బిర్లా
  • దేశవ్యాప్తంగా ప్రధాని పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ, ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర భారతావనికి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి కూడా మోదీయే ప్రధానిగా సేవలు అందించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

భారత్‌ను ఒక గ్లోబల్ సూపర్ పవర్‌గా మార్చేందుకు ప్రధాని మోదీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని ముఖేశ్ అంబానీ కొనియాడారు. దేశ భవిష్యత్తు కోసం ఇంతలా శ్రమించే నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని అన్నారు. మొదట గుజరాత్‌ను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన మోదీ, ఇప్పుడు యావత్ భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తున్నారని ప్రశంసించారు. 145 కోట్ల భారతీయులతో కలిసి తాను ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, ఆయన నిండు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానని అంబానీ తన సందేశంలో పేర్కొన్నారు.

ముఖేశ్ అంబానీతో పాటు ఇతర పారిశ్రామిక దిగ్గజాలు సైతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు. ప్రధాన మంత్రితో ప్రతి సమావేశం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అన్నారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను నేర్చుకుని, వాటిని భారత్‌కు అనుగుణంగా మార్చడం మోదీ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ, టెక్నాలజీని ఉపయోగించి సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని బలమైన పునాది వేశారని అన్నారు.

ప్రధాన మంత్రి మోదీ ఎంతో ఓపికగా తాము చెప్పే విషయాలను వింటారని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా తెలిపారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను పెంచడానికి ఏం చేయాలో ఎప్పుడూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటారని ఆయన వివరించారు. కాగా, ప్రధాని 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mukesh Ambani
Narendra Modi
PM Modi birthday
Reliance Industries
Indian economy
Uday Kotak

More Telugu News