Donald Trump: అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టి నేరాలకు పాల్పడితే ఉగాండా జైలుకే..!: ట్రంప్​

Donald Trump Warns Illegal Immigrants will be Jailed in Uganda
  • అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడి లేటెస్ట్ వార్నింగ్ 
  • భారత సంతతి వ్యక్తి హత్య నేపథ్యంలో ట్రంప్ స్పందన
  • బైడెన్ సర్కారు అవలంభించిన విధానాల వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపణ
  • విదేశాలకు చెందిన నేరస్థులను ఎస్వథిని, సౌత్ సూడాన్ లకు పంపిస్తామని వెల్లడి
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఉగాండా, ఎస్వాటిని, సౌత్ సూడాన్ లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారని అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు. అమెరికాలోకి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బైడెన్ సర్కారు అవలంభించిన విధానాల వల్ల నేరస్థులు అమెరికా గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు.

డల్లాస్ లో భారత సంతతికి చెందిన నాగమల్లయ్య దారుణ హత్యపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాగమల్లయ్యను చంపిన హంతకుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ క్యూబా పౌరుడని, అమెరికాలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. గతంలో చిన్న పిల్లలపై అఘాయిత్యం, వాహనాల దొంగతనం కేసులో మార్టినెజ్ ను పోలీసులు జైలుకు పంపించారని చెప్పారు. అయితే, బైడెన్ ప్రభుత్వ విధానాల వల్ల మార్టినెజ్ జైలు నుంచి విడుదలయ్యాడని, తాజాగా నాగమల్లయ్యను హత్య చేశాడని తెలిపారు.

చట్టాలను కఠినంగా అమలు చేసి ఉంటే మార్టినెజ్ బయటకు వచ్చేవాడు కాదన్నారు. మార్టినెజ్ ను క్యూబాకు డిపోర్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆ దేశం అంగీకరించలేదన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇలాంటి నేరస్థులను అటు వారి స్వదేశానికి పంపకుండా, ఇటు అమెరికాలోనూ ఉండనివ్వకుండా మూడో దేశానికి పంపిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇలాంటి నేరస్థులను ఉగాండా, ఎస్వాటిని, సౌత్ సూడాన్ వంటి దేశాలకు పంపించి, అక్కడి జైళ్లలో ఉంచుతున్నామని తెలిపారు. అమెరికాలోకి అక్రమంగా వచ్చి నేరాలకు పాల్పడే వారికి ఇదే గతి పడుతుందని ట్రంప్ హెచ్చరించారు.
Donald Trump
US Immigration
Uganda
Eswatini
South Sudan
Illegal Immigration
Crime
Nagamaallaiah Murder
Yordania Cobos Martinez
Deportation

More Telugu News