Sourav Ganguly: పాక్ మ్యాచ్ బోర్ కొట్టింది.. ఫుట్‌బాల్ చూశా: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Comments on Pakistan Match
  • పాక్ ఆటలో నాణ్యత లేదని ఘాటు విమర్శలు
  • 15 ఓవర్ల తర్వాత ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మారిపోయానన్న దాదా
  • పాత పాక్ జట్టుకు, ఇప్పటి జట్టుకు పోలికే లేదన్న మాజీ కెప్టెన్
 చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌ను తాను కేవలం 15 ఓవర్లు మాత్రమే చూశానని, ఆ తర్వాత ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడ్డానికి టీవీ చానల్ మార్చేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టు ఆటతీరు అత్యంత పేలవంగా ఉందని, వారిలో పోటీతత్వమే కొరవడిందని ఆయన విమర్శించారు.

కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ, "ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో పోటీతత్వమే లేదు. అందుకే నేను 15 ఓవర్ల తర్వాత మాంచెస్టర్ డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు మారిపోయాను. పాకిస్థాన్‌తో మ్యాచ్ చూసే బదులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, చివరికి అఫ్ఘనిస్థాన్ తో భారత్ ఆడినా చూస్తాను" అని స్పష్టం చేశారు.

ఒకప్పటి పాకిస్థాన్ జట్టుతో ఇప్పటి జట్టును అస్సలు పోల్చలేమని గంగూలీ అభిప్రాయపడ్డారు. "పాకిస్థాన్ అనగానే మనకు వసీం అక్రమ్, వకార్ యూనిస్, సయీద్ అన్వర్, జావేద్ మియాందాద్ లాంటి దిగ్గజాలు గుర్తుకొస్తారు. కానీ ఇప్పటి జట్టు అలా లేదు. ఆ జట్టుకు, ఈ జట్టుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. భారత జట్టు ఎంతో ఉన్నత స్థాయిలో ఉందని, పాకిస్థాన్‌తో పోల్చడానికి కూడా వీల్లేదని అన్నారు.

"విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. అయినా పాకిస్థాన్‌తో పాటు ఆసియా కప్‌లోని చాలా జట్ల కంటే భారత్ ఎంతో బలంగా ఉంది. అప్పుడప్పుడు ఒకటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవచ్చేమో గానీ, చాలా సందర్భాల్లో భారత జట్టే అత్యుత్తమంగా నిలుస్తుంది" అని గంగూలీ విశ్లేషించారు.

ఇక మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకపోవడంపై అడిగిన ప్రశ్నకు, "ఆ విషయం గురించి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌నే అడగాలి. అతనే సరైన సమాధానం చెప్పగలడు. ఇప్పటికే అతను దీనిపై స్పందించాడు కూడా" అంటూ దాదా ఆ అంశాన్ని దాటవేశారు. చివరగా, "క్రీడలు ఆగకూడదు, కానీ ఉగ్రవాదం మాత్రం కచ్చితంగా ఆగాలి. ఇది కేవలం భారత్-పాకిస్థాన్‌కు మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ వర్తిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. 
Sourav Ganguly
Pakistan Cricket Team
Asia Cup 2025
India vs Pakistan
Wasim Akram
Waqar Younis
Virat Kohli
Rohit Sharma
Manchester Derby
English Premier League

More Telugu News