Alia Bhatt: బాలీవుడ్ భామలు .. హిట్టు చూస్తే ఒట్టు!

Bollywood Heroines Special
  • టాలీవుడ్ పై బాలీవుడ్ బ్యూటీల ఆసక్తి
  • పాన్ ఇండియా ప్రాజెక్టులే ప్రధాన కారణం 
  • వందల కోట్లతో రూపొందుతున్న సినిమాలు 
  • నిరాశ పరుస్తున్న ఫలితాలు     

ఒకప్పుడు టాలీవుడ్ తెరపై బాలీవుడ్ భామల జోరు ఎక్కువగా ఉండేది. అప్పట్లో తమిళ .. మలయాళ సినిమాల నుంచి వచ్చిన బ్యూటీలు చాలా తక్కువ. ఆ తరువాత కాలంలో బాలీవుడ్ కథానాయికలు తెలుగు వైపు చూడలేదు .. పెద్దగా పట్టించుకోలేదు. ఈ  సమయంలోనే కోలీవుడ్ నుంచి, మల్లూ ఉడ్ నుంచి .. కొన్నాళ్లుగా కన్నడ నుంచి కథానాయికలు కదిలి రావడం మొదలైంది. మొత్తానికి తెలుగు తెరపై తెలుగు హీరోయిన్స్ కాకుండా మిగతా నాయికలు అందాల సందడి చేయడం మొదలుపెట్టారు.

ఈ సమయంలోనే టాలీవుడ్ పాన్ ఇండియా దిశగా కదలడం మొదలైంది. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ప్రపంచపటాన్ని ఆక్రమించింది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ నుంచి  పాన్ ఇండియా సినిమాలు ప్రవహిస్తున్నాయి. ఒక్క తెలుగు సినిమాలో చేసినా అన్ని భాషల్లోని ఆడియన్స్ కి చేరువ కావొచ్చనే ఉద్దేశంతో, బాలీవుడ్ భామలు ఉత్సాహాన్ని చూపించడం మొదలుపెట్టారు. అందిరికీ తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో, మేకర్స్ కూడా వాళ్లను తీసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ వెళ్లారు.  అయితే అలా ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి వచ్చిన బాలీవుడ్ భామలలో, ఒక్క అలియా భట్ కి మినహా ఎవరికి హిట్ పడకపోవడం ఆశ్చర్యమే. రాజమౌళి పుణ్యమా అని ఆమెకి మాత్రమే బ్లాక్ బస్టర్ దక్కింది. మిగతావాళ్లకి భారీ నిరాశనే ఎదురైంది. పైగా అవన్నీ కూడా పెద్ద బ్యానర్లలో .. పెద్ద హీరోల కాంబినేషన్లో .. వందల కోట్ల బడ్జెట్ లో వచ్చిన సినిమాలు కావడమే విశేషం. 'సాహో'తో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ కీ, 'ఆది పురుష్'తో అడుగుపెట్టిన కృతి సనన్ కీ .. 'కల్కి'తో పలకరించిన దీపికా పదుకొనేకి భారీ నిరాశ తప్పలేదు. 

ఇక పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ కూడా సాధారణమైనదేం కాదు. అందువల్లనే అనన్య పాండే 'లైగర్' సినిమాతో టాలీవుడ్లో దిగిపోయింది. అయితే ఈ సినిమా ఫలితం కారణంగా ఆమె చాలా డీలాపడిపోయింది. ఇక ఆచి తూచి చాలా కాలం వెయిట్ చేసి మరీ, 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి జాన్వీ కపూర్ పరిచయమైంది. అయితే ఆ సినిమా ఆశించినస్థాయి విజయాన్ని అందుకోకపోవడం వలన, ఆమె తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇక చరణ్ తో  రెండో సినిమాగా 'గేమ్ ఛేంజర్' చేసిన కియారా అద్వానీకి, ఈ సారి కూడా ఫ్లాప్ తప్పలేదు. ఇదంతా చూస్తుంటే, బాలీవుడ్ భామలకు తెలుగు వైపు నుంచి పాన్ ఇండియా సినిమాలు కలిసిరావడం లేదేమో అనిపించడం లేదూ! 
Alia Bhatt
Bollywood actresses
Telugu cinema
Pan India movies
Kriti Sanon
Deepika Padukone
Janhvi Kapoor
Kiara Advani
South Indian films
Indian cinema

More Telugu News