VP Gautam: తెలంగాణలో వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

Telangana Government Releases Rs1435 Crores for Indiramma Housing Scheme
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు రూ.1435 కోట్లు విడుదల
  • రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం
  • వివిధ దశల్లో కొనసాగుతున్న 1.29 లక్షల గృహాల పనులు
  • నిర్మాణ దశను బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు
  • తాజాగా సోమవారం ఒక్కరోజే 13,841 మందికి రూ.146 కోట్లు జమ
  • ఇప్పటికే కొన్నిచోట్ల గృహప్రవేశాలు చేస్తున్న లబ్ధిదారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 1,435 కోట్లను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులను పారదర్శకంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 2.15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, వాటిలో 1.29 లక్షల ఇళ్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో సుమారు 20 వేల ఇళ్లు గోడల స్థాయికి చేరుకోగా, మరో 8,633 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రతి సోమవారం ఈ చెల్లింపుల ప్రక్రియను చేపడుతున్నామని, ఇందులో భాగంగా గత సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ.146.30 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఇళ్లను వేగంగా పూర్తి చేసుకునేందుకు వీలు కలుగుతోందని అధికారులు తెలిపారు.
VP Gautam
Indiramma Houses Scheme
Telangana Housing
Housing Scheme Funds Release
Telangana Government
House Construction
Beneficiary Payments
Affordable Housing
Telangana News
Housing Development

More Telugu News