Prashant Kishor: బిహార్ రాజకీయాల్లో పీకే చక్రం.. కింగ్‌మేకర్‌గా ప్రశాంత్ కిశోర్

Prashant Kishor Kingmaker in Bihar Politics
  • బిహార్ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌గా అవతరించనున్న ప్రశాంత్ కిశోర్
  • పీకే స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 8.3 శాతం ఓట్లు అంచనా
  • సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌కు 33.5 శాతం మంది మద్దతు
  • ఎన్డీయే, మహాకూటమి మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గట్టిపోటీ
  • నిరుద్యోగమే ప్రధాన ఎన్నికల అంశమని సర్వేలో వెల్లడి
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా మారబోతున్నారా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కింగ్‌మేకర్‌గా అవతరించనున్నారని తాజా ఒపీనియన్ పోల్ ఒకటి స్పష్టం చేసింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో పీకే మద్దతు ఎవరికి దక్కితే వారే అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆదివారం వెలువడిన సర్వే ఫలితాల ప్రకారం, ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 8.3 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి మీ మద్దతు అని ప్రశ్నించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 13.70 శాతం మంది పీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం.

ఇక, సీఎం రేసులో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 33.5 శాతం మద్దతుతో అందరికంటే ముందున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు 24 శాతం మంది మద్దతు పలికారు. కూటముల విషయానికొస్తే, అధికార ఎన్డీయేకు 36.2 శాతం మంది మద్దతు తెలుపగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమికి 35.8 శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు. ఈ రెండు కూటముల మధ్య కేవలం స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది.

ఈ ఎన్నికల్లో నిరుద్యోగం, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కీలక అంశాలుగా మారనున్నాయని తెలుస్తోంది.
Prashant Kishor
Bihar politics
Jan Suraj Party
Bihar election
Tejashwi Yadav
Nitish Kumar
political strategist
opinion poll
RJD
NDA

More Telugu News