Telangana: ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. నేటి అర్ధరాత్రి నుంచే నిలిపివేత

Aarogyasri Services to Halt Tonight in Telangana
  • నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ సేవలు బంద్
  • నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటన
  • ఏడాదిగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలే కారణం
  • రూ.1,200 కోట్లకు పైగా చెల్లించాలంటున్న ఆస్పత్రులు
  • గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో సమ్మె నిర్ణయం
తెలంగాణ‌లోని పేదలకు ఇది ఒక చేదువార్త. ఎంతోమందికి సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నిలిచిపోనున్నాయి. నేటి (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని ఆయన వివరించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల లెక్కల ప్రకారం, ప్రభుత్వ బకాయిలు సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సోమవారం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, బకాయిలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అందుకే ముందుగా ప్రకటించినట్లే సేవలు నిలిపివేయాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పాయి.

వాస్తవానికి సెప్టెంబర్ 1 నుంచే సేవలు నిలిపివేస్తామని గత నెల 21న ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీంతో ఆగస్టు 30న ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఒకటి రెండు రోజుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆస్పత్రులు తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి. అయితే, 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇక సేవలు నిలిపివేయక తప్పడం లేదని ఆస్పత్రులు అంటున్నాయి.

మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు వర్గాలు మాత్రం బకాయిల విషయంలో భిన్నమైన లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.530 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.550 కోట్లు కలిపి మొత్తం రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంటున్నాయి. ప్రభుత్వ హామీ, ఆస్పత్రుల సమ్మె నిర్ణయంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
Telangana
Aarogyasri
Aarogyasri services
EHS
healthcare Telangana
network hospitals
Telangana health scheme
Dr Rakesh
government dues
health services

More Telugu News