Heart Attack: నడుస్తూనే కుప్పకూలింది.. గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

Degree Student Dies of Heart Attack in Nandigama
  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర విషాద ఘటన
  • కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ కుప్పకూలిన 18 ఏళ్ల విద్యార్థిని
  • గుండెపోటుతో నాగమణి అనే యువతి మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
  • ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయిన వైనం
  • ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్న స్నేహితులు, అధ్యాపకులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పటిదాకా కళాశాలలో ఉత్సాహంగా గడిపి, ఇంటికి తిరుగుపయనమైన ఓ డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అకాల మరణం చెందింది. స్నేహితురాలితో నడుచుకుంటూ వెళ్తూనే రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఈ ఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే... అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి (18) నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే సోమవారం కూడా కళాశాలకు హాజరైంది. సాయంత్రం 4.30 గంట‌ల స‌మ‌యంలో తరగతులు ముగిశాక, తన స్నేహితురాలితో కలిసి సీఎం రోడ్డు మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా కింద పడిపోయింది.

దీంతో ఆందోళనకు గురైన స్నేహితురాలు, స్థానికులు వెంటనే స్పందించి నాగమణిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మరణానికి గుండెపోటు కారణమని తెలిపారు. ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నాగమణికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదని స్నేహితులు, అధ్యాపకులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం ఉదయం కాలేజీకి వచ్చే ముందు తనకు గ్యాస్ సమస్యగా ఉందని చెప్పి ఓ మాత్ర వేసుకుందని, సాయంత్రం వరకు అందరితో ఎంతో చలాకీగా మాట్లాడిందని వారు తెలిపారు. అంతలోనే ఇలా జరగడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Heart Attack
Magam Nagamani
Nagamani
NTR district
Nandigama
college student death
degree student
cardiac arrest
Andhra Pradesh news

More Telugu News