Chevireddy Bhaskar Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో మరో చార్జిషీట్ దాఖలు

AP Liquor Scam Chevireddy Bhaskar Reddy Role Detailed
  • లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి, ఆయన అనుచరుల పాత్రలపై పూర్తి స్థాయి వివరాలు చార్జిషీటులో పేర్కొన్న సిట్
  • మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు చేరినట్లు వెల్లడించిన సిట్
  • డబ్బు పంపిణీలో వెంకటేశ్ నాయుడు పాత్ర కీలకంగా పేర్కొన్న సిట్    
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసు విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిన్న రెండవ అనుబంధ అభియోగపత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు.

ఈ తాజా ఛార్జిషీట్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (ఏ-38) పాత్రపై తీవ్ర ఆరోపణలు నమోదు చేశారు. అతనితో పాటు, అతని మిత్రుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు (ఏ-34), ప్రధాన అనుచరుడు ఎం. బాలాజీ కుమార్ యాదవ్ (ఏ-35), వ్యక్తిగత సహాయకుడు ఈ. నవీన్ కృష్ణ (ఏ-36) పాత్రలపై కూడా పూర్తిస్థాయిలో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం.

మద్యం కంపెనీల నుంచి ముడుపులు - ఎన్నికల ఖర్చులకు వాడకం

సిట్ దర్యాప్తు ప్రకారం.. రాష్ట్రంలో మద్యం సరఫరా చేసే సంస్థల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరినట్లు వెల్లడించింది. డబ్బు పంపిణీకి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది.

వెంకటేశ్ నాయుడు - డబ్బు పంపిణీలో కీలక పాత్ర

చెవిరెడ్డి సన్నిహితుడైన వెంకటేశ్ నాయుడు ముడుపుల డబ్బు తరలింపు, కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరించినట్టు పేర్కొంది. ఈ ప్రక్రియలో బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలు ఆయన్ను సహకరించారని సిట్ గుర్తించింది. తుడా వాహనాలు డబ్బు తరలింపుకు వినియోగించారని సిట్ తమ అభియోగపత్రంలో పేర్కొంది.

డిజిటల్ ఆధారాలు కోర్టులో సమర్పణ

చార్జిషీట్‌లో సాంకేతిక ఆధారిత ఆధారాలు కూడా పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాల్స్ వివరాలు (సీడీఆర్), సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంప్స్, డివైస్ యాక్టివిటీ, టోల్ ప్లాజాల వద్ద వాహనాల కదలిక సమాచారం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అన్నీ ఈ అభియోగపత్రంతో పాటుగా కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

ఇప్పటివరకూ కేసులో స్థితిగతులు

లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. పైలా దిలీప్ (ఏ-30), కాల్వ ధనుంజయరెడ్డి (ఏ-31), పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప (ఏ-33)లు బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేశ్ నాయుడు సహా 8 మంది ఇంకా జైలులోనే ఉన్నారు. 
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh
Liquor Case Investigation
ACB Court Vijayawada
Venkatesh Naidu
Liquor Money Distribution
Tuda Vehicles

More Telugu News