Swiggy: టోయింగ్... ఫుడ్ డెలివరీ కోసం కొత్త యాప్ తీసుకువచ్చిన స్విగ్గీ

Swiggy Launches Toing App for Budget Food Delivery
  • విద్యార్థులే టార్గెట్.. రూ.100కే మీల్స్!
  • మహారాష్ట్రలోని పుణె నగరంలో సేవలు ప్రారంభం
  • కస్టమర్ల నుంచి ఎలాంటి సర్జ్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటన
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో అగ్రగామిగా ఉన్న స్విగ్గీ, మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విద్యార్థులు, తక్కువ ఆదాయం ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని 'టోయింగ్' అనే సరికొత్త డెలివరీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ సేవలను మహారాష్ట్రలోని పుణె నగరంలో ప్రారంభించింది.

ఈ టోయింగ్ యాప్ ద్వారా వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే భోజనాన్ని అందించడం ప్రధాన ఉద్దేశం. కేవలం రూ.100 నుంచి రూ.150 ధరల శ్రేణిలో మీల్స్‌ను అందుబాటులో ఉంచారు. అన్నింటికన్నా ముఖ్యంగా, రద్దీ సమయాల్లో వసూలు చేసే సర్జ్ ఫీజును ఈ యాప్‌లో పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్విగ్గీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం బడ్జెట్ చూసుకునే యువతను విశేషంగా ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది.

సాధారణంగా స్విగ్గీ తన కొత్త సేవలను బెంగళూరులో పరీక్షిస్తుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా, విద్యార్థులు, యువత ఎక్కువగా ఉండే పుణె నగరాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఈ యాప్ కోసం ప్రత్యేకంగా పింక్, గ్రీన్ కలర్ థీమ్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను రూపొందించారు.

గతంలో అన్ని సేవలను ఒకే యాప్‌లో (సూపర్ యాప్) అందించాలని భావించిన స్విగ్గీ, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కో సేవకు ఒక్కో ప్రత్యేక యాప్‌ను (సూపర్ బ్రాండ్స్) తీసుకురావడంలో భాగంగానే 'టోయింగ్'ను లాంచ్ చేసింది. టోయింగ్‌తో కలిపి స్విగ్గీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు మొత్తం ఏడు యాప్‌లు ఉన్నాయి. పుణెలో లభించే స్పందనను బట్టి, భవిష్యత్తులో ఈ సేవలను దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Swiggy
Swiggy Towy
Towy app
food delivery app
Pune
Maharashtra
budget meals
student discount
online food delivery
super app

More Telugu News