Tatiponda Rajaiya: స్టేషన్ ఘన్‌పూర్‌లో భగ్గుమన్న రాజకీయాలు.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గృహ నిర్భంధం

Tatiponda Rajaiya House Arrested Amid Political Tensions in Station Ghanpur
  • తాటికొండ రాజయ్య పాదయాత్రకు బ్రేక్ వేసిన పోలీసులు
  • పాదయాత్రకు వెళ్లకుండా గృహ నిర్భంధం
  • నిన్న కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజయ్య
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోరుకు సిద్ధమైన మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో ఆయన చేపట్టాలనుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వివరాల్లోకి వెళితే, కడియం శ్రీహరికి వ్యతిరేకంగా రఘునాథపల్లిలో పాదయాత్ర చేసేందుకు రాజయ్య సిద్ధమవ్వగా, పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు ఉన్నందున, పాదయాత్రకు వెళ్లడం సరికాదని సూచించారు. అయినప్పటికీ, రాజయ్య వెనక్కి తగ్గకపోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ను గృహ నిర్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాగా, నిన్న కడియం శ్రీహరిపై రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. "కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే, వరంగల్ గడ్డ పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి" అని ఆయన సవాల్ విసిరారు. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం కడియం పార్టీ మారి, ఏకంగా రూ. 200 కోట్లకు అమ్ముడుపోయారని సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరిపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా రాజయ్య డిమాండ్ చేశారు. ఈ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. 
Tatiponda Rajaiya
Station Ghanpur
Kadiyam Srihari
BRS party
Telangana politics
House arrest
Padayatra
Raghunathpally
Political conflict
Warangal

More Telugu News