UPI: పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేవారికి గుడ్‌న్యూస్.. యూపీఐ లిమిట్ భారీగా పెంపు

NPCI raises daily UPI payment limit on P2M transactions to Rs 10 lakh
  • యూపీఐ లావాదేవీల పరిమితిని పెంచిన ఎన్‌పీసీఐ
  • కొన్ని రంగాలకు రోజుకు రూ.10 లక్షల వరకు చెల్లింపులకు అనుమతి
  • వ్యక్తుల మధ్య చెల్లింపుల పరిమితిలో ఎలాంటి మార్పు లేదు
  • బీమా, క్యాపిటల్ మార్కెట్లకు రూ.5 లక్షల వరకు ఒక్కో లావాదేవీ
  • రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకూ ఊరట
యూపీఐ ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసేవారికి శుభవార్త. తరచూ లావాదేవీల పరిమితి సమస్యను ఎదుర్కొనే వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఊరట కల్పించింది. ఎంపిక చేసిన కొన్ని కీలక రంగాల్లో రోజువారీ లావాదేవీల పరిమితిని ఏకంగా రూ.10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి.

ఇంతకుముందు పెద్ద మొత్తంలో బీమా ప్రీమియంలు, పెట్టుబడులు, లేదా ఇతర ఖర్చులు చెల్లించాలంటే లావాదేవీలను విభజించాల్సి రావడం లేదా చెక్కులు, బ్యాంకు బదిలీల వంటి పాత పద్ధతులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను తొలగించి, అధిక విలువైన లావాదేవీలను డిజిటల్ బాట పట్టించేందుకే ఈ మార్పులు చేసినట్లు ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ పెంచిన పరిమితులు కేవలం వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి.

ఏయే రంగాల్లో ఎంత పరిమితి పెరిగింది?
తాజా మార్పుల ప్రకారం, క్యాపిటల్ మార్కెట్లు, బీమా ప్రీమియంల చెల్లింపుల కోసం ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఈ విభాగాల్లో ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు చెల్లించవచ్చు. అలాగే, రుణ వాయిదాలు (ఈఎంఐ), ప్రయాణ బుకింగ్‌లు, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ లావాదేవీల కోసం కూడా ఒక్కో లావాదేవీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.

క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి రూ.5 లక్షల వరకు అవకాశం కల్పించగా, రోజువారీ పరిమితిని రూ.6 లక్షలుగా నిర్ణయించారు. నగల కొనుగోళ్లకు లావాదేవీ పరిమితిని రూ.2 లక్షలకు, రోజువారీ పరిమితిని రూ.6 లక్షలకు పెంచడం ద్వారా వినియోగదారులకు కొంత వెసులుబాటు కల్పించారు.

అయితే, వ్యక్తుల మధ్య (P2P) రోజువారీ లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పు చేయలేదని, అది యథాతథంగా రూ.1 లక్షగానే కొనసాగుతుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. ఈ పెంచిన పరిమితులు కేవలం ధృవీకరించబడిన వ్యాపారులకు (వెరిఫైడ్ మర్చంట్స్) చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయని, ఇది లావాదేవీల భద్రతను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ఫిన్‌టెక్ సంస్థలు, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. వినియోగదారులు ఎలాంటి అదనపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండానే ఈ కొత్త పరిమితులు ఆటోమేటిక్‌గా వర్తిస్తాయని ఎన్‌పీసీఐ తెలిపింది.
UPI
NPCI
UPI transaction limit
National Payments Corporation of India
digital payments
RuPay
P2M transactions
fintech
digital India
payment limit increase

More Telugu News