Triple Talaq: కోర్టు బయట ట్రిపుల్ తలాక్... భర్తను వెంటాడి చెప్పుతో చితకబాదిన భార్య

Triple Talaq Outside Court Wife Beats Husband in Rampur
  • ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఘటన 
  •  కోర్టు బయట ట్రిపుల్ తలాక్ చెప్పడంతో తీవ్ర ఘర్షణ
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన వీడియో
  •  వరకట్న వేధింపులు సహా పిల్లల్ని లాక్కున్నాడని బాధితురాలి ఆరోపణ
  •  ఆత్మరక్షణ కోసమే దాడి చేశానంటున్న మహిళ
  •  తనకు న్యాయం చేయాలని, పిల్లల్ని అప్పగించాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఓ మహిళ తన భర్తను చెప్పుతో చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటన వెనుక తన బాధ, అంతులేని ఆవేదన ఉన్నాయని ఆ మహిళ కన్నీటిపర్యంతమయ్యారు. భరణం కేసు విచారణకు వస్తే.. కోర్టు బయటే తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం తిరగబడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

రాంపూర్‌కు చెందిన ఓ మహిళకు 2018లో వివాహమైంది. పెళ్లయిన కొద్ది కాలానికే అదనపు కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆరోపించారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఇంట్లో నుంచి గెంటేశాడని, ఆ తర్వాత తాను భరణం కోసం కోర్టును ఆశ్రయించగా పిల్లలను కూడా తన నుంచి బలవంతంగా లాక్కున్నాడని ఆమె వాపోయారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జరిగిన విచారణకు బాధితురాలు తన అత్తతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.

విచారణ ముగిసి బయటకు వస్తున్న సమయంలో ఆమె భర్త, మామ ఆమెను అడ్డగించి, కేసును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో, మామ ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే మూడుసార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగినట్టు బాధితురాలు వివరించారు. ఈ అనూహ్య పరిణామంతో ఆగ్రహానికి గురైన ఆమె, ఆత్మరక్షణ కోసం తన కాలి చెప్పు తీసి భర్త కుర్తా పట్టుకుని చితకబాదారు. మామపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో భర్త కుర్తా చిరిగిపోయింది. అక్కడున్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ "వాళ్లిద్దరూ కలిసి నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. నా పిల్లల్ని దూరం చేసి, నా జీవితాన్ని నాశనం చేసి, ఇప్పుడు తలాక్ చెప్పి దాడి చేస్తే ఏ మహిళ మాత్రం సహిస్తుంది? అందుకే తిరగబడ్డాను. నాకు న్యాయం కావాలి. నా ఇద్దరు కూతుళ్లను (ఆరేళ్లు, రెండేళ్లు) నాకు అప్పగించాలి. వారికి భరణంతో పాటు మేం అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలి. నిందితులకు కఠిన శిక్ష పడాలి" అని డిమాండ్ చేశారు.
Triple Talaq
Rampur
Uttar Pradesh
Divorce
Domestic Violence
Dowry Harassment
Court
India
Muslim Women
Maintenance Case

More Telugu News