Tamim Ansari: తురకపాలెం జలాల్లో పరిమిత స్థాయిలోనే యురేనియం.. జిల్లా కలెక్టర్

Tamim Ansari Clarifies Uranium Levels in Turakapalem Water
  • 8 నీటి నమునా పరీక్షల్లో 4 నమూనాల్లోనే యురేనియం ఆనవాళ్లు
  • ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్న కలెక్టర్ తమీమ్ అన్సారియా
  • వాటర్ ట్యాంకుల ద్వారా గ్రామంలో నీటి సరఫరా
గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే, నీటి వనరుల్లో యురేనియం స్థాయి అనుమతించిన పరిమితిలోనే ఉందని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు.

గ్రామంలో సంభవించిన మరణాల నేపథ్యంలో, సెకండరీ హెల్త్ సంచాలకురాలు డాక్టర్ సిరి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీ గ్రామంలోని బోరు బావుల నుండి 8 నీటి నమూనాలను సేకరించింది. ఈ నమూనాలను సంబంధిత ప్రయోగశాలలో పరీక్షించగా 4 నమూనాల్లో యురేనియం ఆనవాళ్లు ఉన్నప్పటికీ, అవి అనుమతించబడిన భద్రమైన పరిమితిలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.

"ప్రస్తుతం గ్రామంలో నీటి కారణంగా ఆరోగ్యహాని కానీ, మరణాలు సంభవించడం కానీ జరగలేదని తేలింది. అయినప్పటికీ, బయాలాజికల్ కాలుష్య నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి" అని కలెక్టర్ పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తురకపాలెం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు వెల్లడించారు. స్థానికంగా ఉన్న బోరు నీటిని తాగడానికి ఉపయోగించకుండా, సరఫరా చేస్తున్న ట్యాంకర్ల నీటినే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. 
Tamim Ansari
Turakapalem
Guntur district
uranium levels
water contamination
health concerns
water samples
safe drinking water
Andhra Pradesh
collector statement

More Telugu News