India vs Pakistan: పాక్‌పై భారత్ ఘన విజయం.. కానీ మైదానంలో వింత దృశ్యం!

Suryakumar Yadav Asia Cup India vs Pakistan No Handshakes
  • ఆసియా కప్ మ్యాచ్ అనంతరం చేతులు కలుపుకోని భారత్, పాక్ ఆటగాళ్లు
  • ఆనవాయితీకి భిన్నంగా కరచాలనాలు లేకుండానే ముగిసిన మ్యాచ్
  • పాకిస్థాత్‌ను 127 పరుగులకే కట్టడి చేసిన భారత బౌలర్లు
  • కెప్టెన్ సూర్యకుమార్ అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియా ఘన విజయం
  • పుట్టినరోజున జట్టును గెలిపించిన సూర్యకుమార్ యాదవ్
ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు కంటే మైదానంలో చోటుచేసుకున్న ఒక అసాధారణ ఘటనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తి ప్రదర్శనలో భాగంగా ఒకరికొకరు షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ, ఈ మ్యాచ్‌లో అందుకు భిన్నంగా జరిగింది. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు కరచాలనాలు చేసుకోకుండానే మైదానాన్ని వీడారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. విజయానికి కావాల్సిన పరుగులను సిక్సర్‌తో పూర్తి చేసిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తనతో పాటు క్రీజ్‌లో ఉన్న శివమ్ దూబేతో కలిసి పెవిలియన్‌కు నడిచాడు. భారత ఆటగాళ్లు, సిబ్బంది తమలో తాము అభినందనలు తెలుపుకున్నారే తప్ప, పాక్ ఆటగాళ్లతో ఎటువంటి పలకరింపులు జరగలేదు. కేవలం మ్యాచ్ ముగిశాకే కాదు, ఉదయం టాస్ సమయంలో కూడా ఇరుజట్ల కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, సల్మాన్ అలీ ఆఘా ఒకరితో ఒకరు కరచాలనం చేసుకోలేదు, కనీసం కళ్లలోకి కూడా చూసుకోలేదు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. పాకిస్థాన్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే కట్టడి చేశారు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 47 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తన పుట్టినరోజున జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించడం విశేషం.

ఈ విజయంతో గ్రూప్-ఎలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన భారత్, సూపర్ ఫోర్ దశకు దాదాపుగా అర్హత సాధించింది. ఇరుజట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తే, వచ్చే ఆదివారం మరోసారి తలపడే అవకాశం ఉంది.
India vs Pakistan
Suryakumar Yadav
Asia Cup 2025
India Win
Kuldeep Yadav
Abhishek Sharma
Salman Ali Agha
Cricket
India Cricket
Pakistan Cricket

More Telugu News