Suryakumar Yadav: పాక్‌పై గెలుపు సైనికులకే అంకితం: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

Suryakumar Yadav Makes Big Pahalgam Statement Dedicates Asia Cup Win Against Pakistan To Armed Forces
  • ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • గెలుపును భారత సాయుధ బలగాలకు అంకితమిచ్చిన కెప్టెన్ సూర్య
  • పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటన
  • పాక్‌తో మ్యాచ్ కూడా మాకు మరో ఆట లాంటిదేనని వ్యాఖ్య
ఆసియా కప్ 2025లో దాయాది పాకిస్థాన్‌పై సాధించిన అద్భుత విజయాన్ని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దేశ సాయుధ బలగాలకు అంకితమిచ్చాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ జట్టు అండగా నిలుస్తుందని సూర్య‌ స్పష్టం చేశాడు. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా టీమిండియా సార‌థి సూర్యకుమార్ మాట్లాడుతూ, "ఈ విజయాన్ని మా సాయుధ బలగాలకు అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. వారి ధైర్యసాహసాలు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. మైదానంలో మా ప్రదర్శన ద్వారా వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాం" అని అన్నాడు.

ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులు మరణించిన ఉగ్రదాడి, ఆ తర్వాత మే నెలలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ వంటి పరిణామాల తర్వాత ఈ మ్యాచ్ జరిగింది.

అయితే, ఈ మ్యాచ్‌ను తమ జట్టు మరో సాధారణ గేమ్‌లానే చూసిందని సూర్యకుమార్ తెలిపాడు. "భారత్‌కు ఇది సరైన బహుమతి. ఇలాంటి మ్యాచ్ గెలవాలని ఎవరైనా కోరుకుంటారు. గెలిచినప్పుడు ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించాలన్న నా చిరకాల కోరిక ఈ మ్యాచ్‌తో నెరవేరింది" అని సూర్య‌ వివరించాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే, తాము ఒకే రకమైన సన్నద్ధతతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు.
Suryakumar Yadav
India vs Pakistan
Asia Cup 2025
Pahalgam Terrorist Attack
Indian Armed Forces
Operation Sindoor
India Pakistan Relations
Cricket Match

More Telugu News