Suryakumar Yadav: ఆసియా కప్ లో పాక్‌ ఢమాల్... టీమిండియా సూపర్ విక్టరీ

Suryakumar Yadav Leads India to Victory Over Pakistan in Asia Cup
  • ఆసియా కప్‌ 2025లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
  • తొలుత పాకిస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు 
  • అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్
  • 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన భారత్
  • కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్
ఆసియా కప్ 2025లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేయగా, 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించడం హైలైట్ గా నిలిచింది. 

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, వారి నిర్ణయం బెడిసికొట్టింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2/18) తమ మాయాజాలంతో పాక్ మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. వీరితో పాటు జస్‌ప్రీత్ బుమ్రా కూడా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో పాకిస్థాన్ 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది. చివర్లో షాహీన్ అఫ్రిది కేవలం 16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.

అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ (31) అతనికి చక్కటి సహకారం అందించాడు. చివరకు భారత్ 15.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, మరో 25 బంతులు మిగిలి ఉండగానే సునాయాస విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో టోర్నీలో టీమిండియా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
Suryakumar Yadav
Asia Cup 2025
India vs Pakistan
Cricket Match
Kuldeep Yadav
Axar Patel
Jasprit Bumrah
Shaheen Afridi
Abhishek Sharma
Shubman Gill

More Telugu News