Chandrababu Naidu: రోజుకు లక్ష మంది రాకపోకలు... తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలి: సీఎం చంద్రబాబు

Chandrababu directs officials to build state of the art bus station in Tirupati
  • తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి సన్నాహాలు
  • రోజుకు లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మాణం
  • హెలిప్యాడ్, మాల్స్, మల్టీప్లెక్స్‌లతో కూడిన డిజైన్లు
  • భవిష్యత్ అవసరాల కోసం ప్రతి బస్సుకు ఈవీ చార్జింగ్ సౌకర్యం
  • బస్ స్టేషన్ నమూనాలను పరిశీలించి అధికారులకు సీఎం సూచనలు
  • రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని ఆదేశం
రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు... నూతనంగా నిర్మించే బస్ స్టేషన్‌లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని, హెలిపాడ్ సౌకర్యంతో పాటు, రోప్ వే, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, మల్టీ ప్లెక్స్‌లతో డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు. 

రెండు బస్ ఎంట్రీలు, ఎగ్జిట్‌ వేలు 2 ఏర్పాటు చేయాలని, సోలార్ రూఫ్ టాప్‌తో సొంత విద్యుత్ అవసరాలు తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం లక్ష మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు. 

భవిష్యత్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతీ బస్సుకు చార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మోడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్ స్టేషన్లు ఆధునీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచనలు చేశారు.

Chandrababu Naidu
Tirupati
Tirupati bus station
APSRTC
Andhra Pradesh
Modern bus terminal
Electric buses
Transportation
Infrastructure development
National Highways Logistics Management

More Telugu News