Nara Lokesh: ఆంధ్రా క్రికెట్ జట్టుకు విదేశీ కోచ్... మంత్రి నారా లోకేశ్ స్పందన

Nara Lokesh responds to Andhra cricket teams foreign coach appointment
  • ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్
  • ప్రపంచంలోని అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా గుర్తింపు
  • న్యూజిలాండ్‌ను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిపిన ఘనత
  • ఈ నియామకాన్ని స్వాగతించిన నారా లోకేశ్
  • ఏపీ క్రీడా ప్రతిష్ఠను పెంచే కీలక ముందడుగు అని వ్యాఖ్య
  • యువ క్రికెటర్ల నైపుణ్యానికి పదును పెట్టనున్న స్టీడ్ అనుభవం
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కోచ్‌లలో ఒకరిగా పేరుగాంచిన న్యూజిలాండ్ దిగ్గజం గ్యారీ స్టీడ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. స్టీడ్ మార్గదర్శకత్వంలో న్యూజిలాండ్ జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడమే కాకుండా, పలు ఐసీసీ టోర్నమెంట్లలో రన్నరప్‌గా నిలిచింది. అంతటి విశేష అనుభవం ఉన్న కోచ్ ఇప్పుడు ఆంధ్ర జట్టుకు దిశానిర్దేశం చేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కీలక నియామకంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. గ్యారీ స్టీడ్ వంటి అద్భుతమమైన కోచ్ రాకతో రాష్ట్రంలోని యువ క్రికెటర్లలో నైపుణ్యం మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అనుభవం, శిక్షణా పద్ధతులు ఆంధ్ర జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళతాయని, ప్రపంచ క్రికెట్ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం లభిస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ సరి కొత్త ప్రస్థానంలో గ్యారీ స్టీడ్‌కు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

గ్యారీ స్టీడ్ పర్యవేక్షణలో ఆంధ్రా క్రికెట్ జట్టు ప్రదర్శన మెరుగుపడటమే కాకుండా, దేశవాళీ టోర్నీలలో బలమైన శక్తిగా ఎదుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియామకంతో రాష్ట్ర క్రీడా రంగ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని, యువతకు క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు ఇది దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
Nara Lokesh
Andhra cricket
Gary Stead
Andhra Cricket Association
New Zealand cricket coach
AP sports
Cricket news
Domestic cricket
Sports analysis
Andhra Pradesh

More Telugu News