Mohammad Akbar: మూడేళ్ల బాబును చంపి మూసీలో పడేసిన కన్నతండ్రి

Hyderabad Father Kills 3 Year Old Son Dumps Body in Moosi
  • హైదరాబాద్ లో అమానవీయ ఘటన
  • బాబు అనారోగ్యమే కారణమని వెల్లడించిన తండ్రి
  • తలపై దిండు పెట్టి చంపేసినట్లు గుర్తించిన పోలీసులు
మూడేళ్ల బాబు తరచూ అనారోగ్యం పాలవడం భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది. దీంతో విసిగిపోయిన భర్త దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. కన్నకొడుకును చంపేసి మూటకట్టి మూసీలో పడేశాడు. బాబు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు తండ్రి నిర్వాకాన్ని బయటపెట్టారు.

హైదరాబాద్ లోని బండ్లగూడలో జరిగిన ఈ అమానవీయ ఘటన వివరాలు.. నూరినగర్‌ కు చెందిన మహ్మద్‌ అక్బర్‌, సనాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు. అక్బర్ కూరగాయల వ్యాపారం చేస్తుండగా.. సనాబేగం నీలోఫర్ లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. వీరి చిన్న కుమారుడు (3) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడి అనారోగ్యం విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కుమారుడిని కడతేర్చాలని అక్బర్ నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం సనాబేగం పనికి వెళ్లగా.. తెల్లవారుజామున కుమారుడి తలపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. బాబు చనిపోయాక ఓ సంచీలో మూటకట్టి తీసుకెళ్లి మూసీలో పడేసి వచ్చాడు. తెల్లవారాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా వీధిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అక్బర్ తెల్లవారుజామున ఓ సంచీతో బైక్ పై వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు అక్బర్ ను గట్టిగా విచారించగా.. కుమారుడిని తానే చంపేసినట్లు వెల్లడించాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబు మృతదేహం కోసం మూసీలో గాలిస్తున్నారు.
Mohammad Akbar
Hyderabad crime
child murder
Moosi river
Bandlaguda
domestic dispute
police investigation
cctv footage
Telangana news

More Telugu News