Asaduddin Owaisi: పాకిస్థాన్ తో మ్యాచ్... 26 మంది ప్రాణాల కంటే డబ్బే ముఖ్యమా? అంటూ ఒవైసీ ఫైర్

Asaduddin Owaisi Fires Over India Pakistan Match After Terror Attack
  • ఆసియా కప్ లో నేడు ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్
  • పహల్గామ్ లో మతం అండిగి 26 మందిని చంపేశారన్న ఒవైసీ
  • మ్యాచ్ వద్దని చెప్పే దమ్ము మీకు లేదా అని యూపీ, అసోం సీఎంలకు ప్రశ్న
భారత్, పాకిస్థాన్ మధ్య ఈరోజు జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో పాటు పలు విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దేశ భద్రత, పౌరుల ప్రాణాల కంటే ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమా? అని నేరుగా ప్రశ్నిస్తున్నాయి.

ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "పహల్గామ్‌లో మన 26 మంది పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడవద్దని చెప్పే దమ్ము మీకు లేదా?" అని అసోం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా బీసీసీఐకి వచ్చే రూ.2000 కోట్లు, రూ.3000 కోట్లు 26 మంది పౌరుల ప్రాణాల కన్నా ఎక్కువైపోయాయా? అని నిలదీశారు. "రక్తం, నీరు కలిసి పారలేవని, ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి సాగవని గతంలో ప్రధాని చెప్పిన మాటలను" ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ 26 మంది పౌరుల కుటుంబాలకు తాము నిన్న, నేడు, రేపు కూడా అండగా నిలుస్తామని ఒవైసీ స్పష్టం చేశారు.

మరోవైపు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఈ మ్యాచ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఉగ్రవాదంతో చర్చలు జరపబోమని ఒకవైపు చెబుతూనే, మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందని కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ విమర్శించారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు.

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒక అడుగు ముందుకేసి, ఢిల్లీలో పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలిపారు. "మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసిన నీచమైన వాళ్లతో మన క్రికెటర్లను ఆడిస్తున్నారు" అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్బులు, రెస్టారెంట్లను బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద, ఈ క్రికెట్ మ్యాచ్ కేంద్రానికి, విపక్షాలకు మధ్య కొత్త రాజకీయ ఘర్షణకు దారితీసింది. 
Asaduddin Owaisi
India Pakistan match
Asia Cup 2023
Pahalgam terror attack
BCCI
terrorism
political conflict
Indian politics
Congress party
Aam Aadmi Party

More Telugu News