Telangana Lok Adalat: తెలంగాణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 11లక్షల కేసుల పరిష్కారం

Telangana Lok Adalat Solves 11 Lakh Cases
  • తెలంగాణలో విజయవంతంగా ముగిసిన జాతీయ లోక్ అదాలత్
  • బాధితులకు రూ.595 కోట్ల మేర పరిహారం చెల్లింపు
  • హైకోర్టులో రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.20 కోట్ల పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏకంగా 11 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దీని ద్వారా బాధితులకు మొత్తం రూ.595 కోట్ల మేర పరిహారం లభించింది. ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి మీడియాకు వెల్లడించారు.

ఈ లోక్ అదాలత్ కార్యక్రమాలను టీఎస్ఎల్‌ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి. శ్యాంకోషీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన స్వయంగా నిర్మల్ జిల్లాలో లోక్ అదాలత్‌ను ప్రారంభించి, పలు కేసులకు సంబంధించిన పరిహారం చెక్కులను వాదిప్రతివాదులకు అందజేశారు. రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

మరోవైపు, హైకోర్టు ప్రాంగణంలోనూ లోక్ అదాలత్ నిర్వహించారు. హైకోర్టు న్యాయ సేవా కమిటీ ఛైర్‌పర్సన్ జస్టిస్ మౌషమీ భట్టాచార్య పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక కీలకమైన కేసు పరిష్కారమైంది. 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైకల్యానికి గురైన ఓ విద్యార్థి కేసులో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో రాజీ కుదిరింది. బాధితుడికి రూ.1.20 కోట్ల భారీ పరిహారం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. ఈ పరిహారం చెక్కును జస్టిస్ మౌషమీ భట్టాచార్య స్వయంగా బాధిత విద్యార్థికి అందించారు. ఈ ఒక్క లోక్ అదాలత్‌తో లక్షలాది పెండింగ్ కేసులకు ముగింపు పలకడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 
Telangana Lok Adalat
Lok Adalat
Telangana
National Legal Services Authority
Justice P Shyam Koshi
Justice Moushumi Bhattacharya
TSLSA
court cases
NALSAR

More Telugu News