Venkataiah: కోడ్ భాషతో యజమానిని గుర్తించి.. దొంగల ఆట కట్టించిన మేకలు!

Hyderabad Goat Theft Foiled by Animal Loyalty
  • హైదరాబాద్ జియాగూడ మార్కెట్లో ఆసక్తికర ఘటన
  • కోడ్ భాషతో పిలవగానే యజమాని వద్దకు పరుగులు
  • రంగారెడ్డి జిల్లాలో 30 మేకల దొంగతనం కేసులో పురోగతి
  • మొత్తం 200 మేకలు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్
మూగజీవాలైనా తమ యజమానిపై అవి చూపిన విశ్వాసం ఓ దొంగల ముఠా ఆట కట్టించింది. మూడు రోజుల క్రితం అపహరణకు గురైన మేకలు.. మార్కెట్లో తమ యజమాని కుమారుడిని చూడగానే గుర్తుపట్టి ఆయన వద్దకు పరుగులు తీశాయి. వాటి ప్రేమతో ఓ భారీ మేకల దొంగల ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడ మార్కెట్లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం పెద్ది ఎల్కిచర్లకు చెందిన వెంకటయ్యకు 30 మేకలు ఉన్నాయి. ఈ నెల 9న గుర్తుతెలియని వ్యక్తులు వాటిని దొంగిలించారు. అప్పటి నుంచి వెంకటయ్య కుటుంబ సభ్యులు వాటి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో 11న వెంకటయ్య కుమారుడు ప్రవీణ్, మేకల కోసం వెతుకుతూ జియాగూడ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఒక కంటైనర్ వద్ద ఉన్న కొన్ని మేకలు ప్రవీణ్‌ను చూసి గట్టిగా అరవడం ప్రారంభించాయి.

అనుమానం వచ్చిన ప్రవీణ్ తాను రోజూ పిలిచే కోడ్ భాషలో వాటిని పిలిచాడు. అంతే, ఆ మేకలన్నీ ఒక్కసారిగా ప్రవీణ్ వద్దకు పరుగెత్తుకొచ్చాయి. దీంతో అవి తమవేనని నిర్ధారించుకున్న ప్రవీణ్ అక్కడ ఉన్న వ్యక్తులను నిలదీశాడు. తాము ఆ మేకలను రూ.30 లక్షలకు కొనుగోలు చేశామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారు ప్రవీణ్‌ను బెదిరించారు. వెంటనే ప్రవీణ్ తన తండ్రికి, కుల్సుంపుర పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మేకలతో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మేకలను దొంగిలించినట్లు అంగీకరించారు. తమ ముఠాలో వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన మరో ముగ్గురు ఉన్నారని వారు వెల్లడించారు. ఈ సమాచారంతో చౌదరిగూడ పోలీసులు పరిగికి వెళ్లి మిగతా ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద దాచి ఉంచిన సుమారు 200 మేకలను స్వాధీనం చేసుకున్నారు. మూగజీవాల విశ్వాసంతో ఓ పెద్ద దొంగల ముఠా పోలీసులకు చిక్కింది.
Venkataiah
Goat theft
Hyderabad
Choudariguda
Telangana police
Goat market
Zia Guda market
Livestock theft
Pargi

More Telugu News