Vijay: ప్రజలను హింసించే వారిని ఎవర్నీ వదలిపెట్టం: విజయ్

Vijay Warns Against Hurting People Launches Election Campaign
  • కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్న విజయ్
  • తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదన్న విజయ్
  • ప్రజాసేవే తన లక్ష్యమన్న విజయ్
ప్రజలను హింసించే వారిని ఎవరినీ విడిచిపెట్టమని ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ అన్నారు. తిరుచ్చిరాపల్లి నుంచి తన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయ్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తాను తిరుచ్చిరాపల్లిని సందర్శించడం కేవలం ప్రారంభం మాత్రమే కాదని, ఇది భవిష్యత్తులో కీలక మలుపుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్వం రాజులు యుద్ధాలకు ముందుగా కులదేవతలకు ప్రార్థనలు చేసేవారని గుర్తు చేస్తూ, తాను కూడా అదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నానని తెలిపారు.

ఒకే దేశం - ఒకే ఎన్నికలకు వ్యతిరేకత

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న "ఒకే దేశం - ఒకే ఎన్నిక" విధానాన్ని విజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ బలాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విద్య, విపత్తుల సహాయ నిధులు వంటి కీలక రంగాలకు కేంద్రం తగిన నిధులు మంజూరు చేయకుండా తమిళనాడుకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. అదే సమయంలో హిందీ భాషను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.

డీఎంకేపై ఆరోపణలు

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గురించి విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే పార్టీ స్వయంగా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో డీఎంకే విఫలమైందని అన్నారు. "తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవే తన లక్ష్యమని," విజయ్ మరో సభలో స్పష్టం చేశారు.

మొరాయించిన మైకు

విజయ్ తొలి ప్రచార సభలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించినప్పటికీ, మైక్ సరిగా పని చేయకపోవడంతో అభిమానులు ఆయన మాటలను పూర్తిగా వినలేకపోయారు. కేవలం రెండు, మూడు నిమిషాల ప్రసంగం మాత్రమే స్పష్టంగా వినిపించింది. అయినప్పటికీ వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. “విజయ్, విజయ్!” అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. 
Vijay
Tamilaga Vettri Kazhagam
TVK
Tamil Nadu politics
One Nation One Election
DMK
BJP
election campaign
Trichy
political speech

More Telugu News