Ponguru Narayana: రాజధాని అంశంపై సజ్జల వ్యాఖ్యలు... అధికారం కోసం జగన్ యూటర్న్ తీసుకున్నారన్న మంత్రి నారాయణ

Ponguru Narayana Slams Jagans U Turn on Capital Issue
  • వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ
  • అధికారం కోసమే రాజధానిపై జగన్ మళ్లీ మాట మారుస్తున్నారని విమర్శలు 
  • అసెంబ్లీలో అమరావతికి ఓటేసి, తర్వాత మూడు రాజధానులన్నారని ఆగ్రహం
  • ఇలాగే చేస్తే వైసీపీకి భవిష్యత్తులో 11 సీట్లు కూడా కష్టమేనని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం అధికారాన్ని తిరిగి దక్కించుకోవడం కోసమే వైసీపీ అధినేత జగన్ రాజధానిపై తన వైఖరిని మార్చుకుంటున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధాని అంశం సాధ్యం కాదని... విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని కట్టాలలని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం తెలిసిందే. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి నుంచే పాలన సాగిస్తారని కూడా సజ్జల వ్యాఖ్యానించారు. రాజధానిపై సజ్జల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ స్పందించారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్, ఆ తర్వాత పూర్తిగా మాట మార్చారని నారాయణ గుర్తుచేశారు. "రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీలో స్వయంగా చెప్పిన వ్యక్తి జగన్. అప్పుడు చేతులెత్తి మద్దతు తెలిపి, అధికారం చేపట్టాక మూడు రాజధానుల పేరుతో ఒక పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం అమరావతి రాగం అందుకోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఇలాంటి రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు" అని ఆయన హితవు పలికారు.

అమరావతి భౌగోళికంగా రాష్ట్రానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని మంత్రి నారాయణ వివరించారు. "విశాఖపట్నం, అనంతపురం, శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాలకు కూడా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడికి రైల్వే, పోర్టులు, విమానాశ్రయాలు వంటి అన్ని రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఏ పార్టీ అయినా నిర్ణయాలు తీసుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై నారాయణ మాట్లాడుతూ, "సజ్జల పార్టీలో సీనియర్ నేత కాబట్టి ఆయన మాటలను పార్టీ అధికారిక అభిప్రాయంగానే పరిగణించాలి. నేను మంత్రిగా మాట్లాడితే అది ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టే భావిస్తారు. అదేవిధంగా, సజ్జల వ్యాఖ్యలు కూడా వైసీపీ అంతర్గత ఆలోచనలకు ప్రతిబింబం" అని అన్నారు. గదిలో నలుగురైదుగురు వ్యక్తులు ఇచ్చే సలహాలు పాటిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదని సూచించారు. "ఇలాంటి వైఖరితో ముందుకెళితే భవిష్యత్తులో వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కడం కష్టమవుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు" అని నారాయణ హెచ్చరించారు.


Ponguru Narayana
Andhra Pradesh capital
Amaravati
Sajjala Ramakrishna Reddy
Jagan Mohan Reddy
YSRCP
Telugu Desam Party
Political criticism
Three capitals
Andhra Pradesh politics

More Telugu News