Osama Bin Laden: బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చింది నిజం కాదా? పాక్‌ను సూటిగా ప్రశ్నించిన ఇజ్రాయెల్

Israel questions Pakistan on sheltering Bin Laden
  • ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విమర్శలు
  • ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చారన్న వాస్తవాన్ని గుర్తు చేసిన ఇజ్రాయెల్
  • బిన్ లాడెన్‌లాగే హమాస్‌కూ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టీకరణ
అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు వారి దేశంలోనే ఆశ్రయం కల్పించి, అతడు అక్కడే హతమైన వాస్తవాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మార్చలేదని ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా దుయ్యబట్టింది. దోహాలో హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ జరిపిన దాడిని చర్చించేందుకు గురువారం భద్రతా మండలి ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఇజ్రాయెల్, పాకిస్థాన్ ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా ఐరాసలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి డాని డనోన్ మాట్లాడుతూ, పాకిస్థాన్ రాయబారి అసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ వైపు చూస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "పాకిస్థాన్‌లో బిన్ లాడెన్‌ను మట్టుబెట్టినప్పుడు, 'విదేశీ గడ్డపై ఉగ్రవాదిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?' అని ఎవరూ అడగలేదు. అసలు 'ఒక ఉగ్రవాదికి ఎందుకు ఆశ్రయం ఇచ్చారు?' అనే ప్రశ్న మాత్రమే తలెత్తింది. ఈ రోజు కూడా అదే ప్రశ్న అడగాలి. బిన్ లాడెన్‌కు ఎలాంటి మినహాయింపు లభించలేదు, హమాస్‌కు కూడా లభించదు" అని ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ ప్రతినిధి వ్యాఖ్యలపై పాకిస్థాన్ రాయబారి అసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ తీవ్రంగా స్పందించారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడిని చట్టవిరుద్ధమైన, రెచ్చగొట్టే చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది ప్రాంతీయ శాంతిని దెబ్బతీసే విస్తృత దురాక్రమణలో భాగమని ఆరోపించారు. గాజాలో క్రూరమైన సైనిక చర్యలతో పాటు సిరియా, లెబనాన్, ఇరాన్, యెమెన్‌లలో సరిహద్దులు దాటి దాడులు చేస్తూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు.

కాగా, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదులకు ఏ దేశం ఆశ్రయం ఇవ్వకూడదని, నిధులు సమకూర్చకూడదని భద్రతా మండలి తీర్మానం చేసిందని డాని డనోన్ గుర్తుచేశారు. ఆనాటి దాడులు అమెరికాకు ఎలాంటివో, అక్టోబర్ 7 దాడులు ఇజ్రాయెల్‌కు అలాంటివేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Osama Bin Laden
Israel
Pakistan
United Nations
Al-Qaeda
Hamas
terrorism
Asim Iftikhar Ahmad

More Telugu News