Roja: అనిత యాంకరా? లేక హోం మంత్రా?: రోజా

Roja Criticizes Anita As Home Minister or Anchor
  • వైసీపీ హయాంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశామన్న రోజా
  • మెడికల్ కాలేజీలు చూపిస్తా.. వస్తావా? అంటూ అనితకు సవాల్
  • చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు
హోం మంత్రి వంగలపూడి అనిత యాంకరా? లేక హోం మంత్రా? అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణాల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈరోజు నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె, హోం మంత్రి అనితకు బహిరంగ సవాల్ విసిరారు.

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే, వాటిలో 7 కాలేజీలను జగన్ పూర్తి చేశారని రోజా అన్నారు. వీటిలో ఐదు కాలేజీలలో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే, మిగిలిన కాలేజీల పనులను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడంలేదని ఆమె మండిపడ్డారు.

"రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించడానికి మీరు వస్తారా హోం మంత్రి? ఆ కాలేజీలు ఎలా ఉన్నాయో, విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారో నేనే స్వయంగా చూపిస్తాను" అంటూ రోజా సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "వారానికి ఒకసారి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి ఎవరు వెళతారో అందరికీ తెలుసు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే మందును చంద్రబాబు కనిపెట్టి, టీడీపీ నేతలందరికీ ఇచ్చారు" అని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంలో విఫలమైందని ఆమె విమర్శించారు.

Roja
Vangalapudi Anita
Andhra Pradesh
Medical Colleges
YS Jagan
Chandrababu Naidu
YSRCP
TDP
Home Minister
Nagari

More Telugu News