Kotha Lokah: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కొత్తలోక'.. 'బాహుబలి 2' రికార్డు బద్దలు

Kotha Lokah Starring Kalyani Priyadarshan Beats Bahubali 2 in Kerala
  • మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న 'కొత్తలోక' చిత్రం
  • కేవలం 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు
  • కేరళలో 'బాహుబలి 2' కలెక్షన్ల రికార్డును అధిగమించిన వైనం
  • అద్భుత శక్తులున్న యువతి పాత్రలో అదరగొట్టిన కళ్యాణి ప్రియదర్శన్
  • రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఇండియా తొలి సూపర్ ఉమెన్ మూవీ
భారీ స్టార్ క్యాస్టింగ్, అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న మలయాళ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన 'లోక చాప్టర్ 1: చంద్ర' (తెలుగులో 'కొత్తలోక') చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ, ఏకంగా 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొట్టింది. ఈ అనూహ్య విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విడుదలైన కేవలం 15 రోజుల్లోనే ఈ సినిమా కేరళలో సంచలనం రేపింది. ఒకప్పుడు అక్కడ రాజమౌళి రూపొందించిన 'బాహుబలి 2' చిత్రం మొత్తం ప్రదర్శనలో రూ. 73 కోట్లు వసూలు చేయగా, 'కొత్తలోక' కేవలం రెండు వారాల్లోనే రూ. 74.7 కోట్లు రాబట్టి ఆ రికార్డును అధిగమించింది. ప్రస్తుతం కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న ఈ సినిమా, నంబర్ 1 స్థానమే లక్ష్యంగా దూసుకుపోతోంది. సినిమాపై ఉన్న అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా 15వ రోజు కూడా రూ. 3.85 కోట్లు వసూలు చేయడం విశేషం.

'కొత్తలోక' చిత్రాన్ని కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ బలమైన కథ, కథనాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇండియాలోనే తొలి సూపర్ ఉమెన్ మూవీగా తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామాలో అసాధారణ శక్తులున్న యువతి 'చంద్ర' పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో 'హలో', 'చిత్రలహరి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఇక్కడ ఆశించిన విజయం సాధించలేకపోయిన కళ్యాణి, ఇప్పుడు ఈ ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. సంప్రదాయ జానపద కథలకు ఆధునిక సూపర్ హీరో అంశాలను జోడించి రూపొందించిన ఈ చిత్రం, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది.
Kotha Lokah
Kalyani Priyadarshan
Malayalam movie
Bahubali 2 record
Kerala box office
Dulquer Salmaan
Dominic Arun
Superwoman movie
Indian cinema
box office collections

More Telugu News