Vijay: 2026 ఎన్నికలే లక్ష్యంగా విజయ్ పొలిటికల్ టూర్.. తిరుచ్చి నుంచి నేడు తొలి ప్రచార యాత్ర

Vijay Political Tour Begins in Trichy Aiming for 2026 Elections
  • ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా తిరుచ్చి
  • అరియలూరులో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్న విజయ్
  • 25 కఠిన షరతులతో సభకు అనుమతించిన పోలీసులు
  • ఎంజీఆర్, అన్నాదురై కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రాంతంలోనే విజయ్ సభ
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తొలి ప్రచార యాత్రను నేడు ప్రారంభించారు. ఈ యాత్ర కోసం ద్రవిడ రాజకీయాల్లో చారిత్రక ప్రాధాన్యమున్న తిరుచ్చి నగరాన్ని వేదికగా ఎంచుకోవడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తి రేపుతోంది.

తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార వాహనంలో బయలుదేరిన విజయ్ అరియలూరులో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన కోసం అత్యాధునిక కెమెరాలు, లౌడ్ స్పీకర్లతో పాటు ఎవరూ బస్సుపైకి ఎక్కకుండా ఇనుప రెయిలింగ్‌లతో కూడిన ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. ‘మీ విజయ్, నేను విఫలం కాను’, ‘తమిళనాడు, విజయ్ వారసత్వం తిరిగొస్తుంది’ వంటి నినాదాలతో కూడిన పార్టీ ప్రచార లోగోను కూడా ఆవిష్కరించారు.

విజయ్ యాత్రకు పోలీసులు 25 కఠిన నిబంధనలతో కూడిన షరతులతో పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. రోడ్‌షోలు, సన్మానాలు, భారీ వాహన కాన్వాయ్‌లపై ఆంక్షలు విధించారు. విజయ్ ప్రచార బస్సును కేవలం ఐదు వాహనాలు మాత్రమే అనుసరించాలని, పార్టీ కార్యకర్తలు ఉదయం 11:25 గంటల కల్లా అరియలూరు పాత బస్టాండ్ వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత కోసం పార్టీయే బారికేడ్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే యాత్రను నిలిపివేసే అధికారం తమకు ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.

తిరుచ్చిని ఎంచుకోవడం వెనుక వ్యూహం?
ద్రవిడ రాజకీయాల్లో కీలక నిర్ణయాలకు తిరుచ్చి చారిత్రకంగా ఓ వేదికగా నిలిచింది. గతంలో ఏఐఏడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) తన చారిత్రాత్మక మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంతేకాకుండా, తిరుచ్చిని తమిళనాడుకు రెండో రాజధానిగా ప్రకటించారు. అలాగే, డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై కూడా తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే కీలక నిర్ణయాన్ని తిరుచ్చిలోనే తీసుకున్నారు. ఇప్పుడు అదే బాటలో విజయ్ కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవల ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి కూడా ఇదే ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు విజయ్ అడుగుపెట్టడంతో ఈ యాత్ర తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక మలుపు అవుతుందని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ఈ ప్రారంభపు ఉత్సాహం రానున్న ఎన్నికల్లో రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
Vijay
Vijay political tour
Tamilaga Vettri Kazhagam
TVK party
Tamil Nadu politics
2026 elections
Tamil Nadu assembly elections
MGR mid-day meal scheme
Tiruchirappalli
Tamil Nadu

More Telugu News