Rahul Gandhi: రాహుల్ గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం.. వీడియో ఇదిగో!

Rahul Gandhi and UP Minister Clash in Raebareli Meeting
  • రాయ్ బరేలీలో ‘దిశా’ సమావేశం నిర్వహించిన అధికారులు
  • ఎంపీ హోదాలో సమావేశానికి రాహుల్ గాంధీ అధ్యక్షత
  • నియోజకవర్గ మంత్రి హోదాలో దినేశ్ ప్రతాప్ సింగ్ హాజరు
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఎంపీ రాహుల్ గాంధీ, యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి దినేశ్ మధ్యలో మాట్లాడడంపై రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి తాను అధ్యక్షత వహిస్తున్నానని, సమావేశంలో ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందు అనుమతి కోరాలని రాహుల్ గాంధీ సూచించారు. 

దీంతో మంత్రి దినేశ్ స్పందిస్తూ.. లోక్ సభలో మీరు స్పీకర్ మాటను మన్నిస్తున్నారా? ఇప్పుడు మీ మాటను నేనెందుకు మన్నించాలని ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిశా సమావేశంలో జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగా మంత్రి దినేశ్ మధ్యలో కల్పించుకుని మాట్లాడడంతో రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా సభ అధ్యక్షుడి అనుమతి కోరాలని హితవు పలికారు. దీంతో రాహుల్ గాంధీ, దినేశ్ ల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, ప్రస్తుతం బీజేపీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దినేశ్ ప్రతాప్ సింగ్ అంతకుముందు కాంగ్రెస్ నేత కావడం విశేషం. 2022 లో దినేశ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ తో గెలిచి ప్రస్తుతం మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
Rahul Gandhi
Dinesh Pratap Singh
Uttar Pradesh
Raebareli
DISHA meeting
UP Minister
Congress
BJP
Political Argument
India Politics

More Telugu News