Abdul Waheed Sheikh: 9 ఏళ్లు జైల్లో పెట్టారు.. రూ.9 కోట్లు ఇవ్వండి: ముంబై పేలుళ్ల కేసు నిర్దోషి

Mumbai Blast Case Acquittal Abdul Waheed Seeks 9 Crore Compensation
  • చేయని నేరానికి కస్టడీలో టార్చర్ చేశారని అబ్దుల్ వహీద్ షేక్ ఆవేదన
  • జైలుకు వెళ్లడంతో తన కెరియర్ మొత్తం నాశనమైందని ఆరోపణ
  • కోర్టు తనను నిర్దోషిగా తేల్చి విడుదల చేసిందని వెల్లడి
ముంబై పేలుళ్ల కేసులో తనను అన్యాయంగా అరెస్టు చేసి తొమ్మిదేళ్ల పాటు జైలుపాలు చేశారని ఈ కేసులో కోర్టు నిర్దోషిగా తేల్చిన అబ్దుల్ వహీద్ షేక్ పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు జైలులో నరకం చూశానని, పేలుళ్ల కేసులో అరెస్టు చేయడంతో తన జీవితం మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి పరిహారంగా రూ.9 కోట్లు ఇప్పించాలంటూ వహీద్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌, మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

2006లో జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్ లో 180 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కేసులో అబ్దుల్ వహీద్ షేక్ ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అరెస్టు చేసింది. సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత 2015లో స్పెషల్ కోర్టు అబ్దుల్ వహీద్ ను నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. ఈ ఏడాది జులైలో ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

వహీద్ వాదన..
ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టు చేయడంతో తన వృత్తి జీవితం నాశనమైందని వహీద్ చెప్పారు. కస్టడీలో చిత్రహింసల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని వహీద్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. వైద్యం కోసం రూ.30 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. పోలీసులు ఆపాదించిన ఉగ్రవాది అనే కళంకం తనకు ఉపాధి లేకుండా చేసిందని వాపోయారు. తాను జైలుకు వెళ్లడంతో తనపైనే ఆధారపడిన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెప్పారు. సామాజికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. తనతో పాటు అరెస్టు అయిన వ్యక్తి మొన్నటి వరకూ జైలులోనే ఉండడంతో నైతిక కారణాల వల్ల పరిహారం కోరలేదని వహీద్ చెప్పారు. ఇటీవల ఈ కేసులో అందరినీ నిర్దోషులుగా తేల్చడంతో ప్రస్తుతం తాను పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వివరించారు.
Abdul Waheed Sheikh
Mumbai train blasts
2006 Mumbai blasts
Maharashtra ATS
wrongful arrest
National Human Rights Commission
Maharashtra Human Rights Commission
compensation
bomb blast case

More Telugu News