North Korea: విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరి.. ఉత్తర కొరియాలో దారుణాలు!

Death Penalty for Watching Foreign TV Dramas in North Korea
  • ఉత్తర కొరియాలో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
  • ప్రపంచంలోనే అత్యంత కఠిన ఆంక్షలున్న దేశంగా గుర్తింపు
  • విపరీతంగా పెరిగిన నిఘా, బలవంతపు చాకిరీ, ఉరిశిక్షలు
  • విదేశీ టీవీ కార్యక్రమాలు చూస్తే మరణశిక్ష విధించేలా కొత్త చట్టాలు
  • దేశం విడిచి పారిపోయిన 300 మంది బాధితుల వాంగ్మూలాల సేకరణ
ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోంది. విదేశీ టీవీ డ్రామాలు చూసినా, షేర్ చేసినా ఉరిశిక్ష విధించే స్థాయికి అక్కడి చట్టాలను కఠినతరం చేశారు. ఆ దేశంలో మానవ హక్కుల అణచివేత తీవ్రస్థాయికి చేరిందని, ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి కఠినమైన ఆంక్షల మధ్య ప్రజలు జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల విభాగం తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది.

సుమారు పదేళ్ల క్రితం ఉత్తర కొరియాలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరుగుతున్నాయని ఐరాస ఒక నివేదిక ఇవ్వగా, ప్రస్తుత నివేదిక ఆనాటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి మరింత దిగజారినట్లు స్పష్టం చేసింది. 2014 తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై ఈ నివేదికను రూపొందించారు. ఇందుకోసం ఉత్తర కొరియా నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన 300 మందికి పైగా బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

కొత్త టెక్నాలజీ సాయంతో ప్రజల ప్రతి కదలికపైనా నిఘాను తీవ్రతరం చేశారని, శిక్షలను మరింత కఠినతరం చేశారని నివేదిక పేర్కొంది. 2015 తర్వాత అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు, విధానాలతో పౌరుల జీవితంలోని ప్రతి అంశంపైనా ప్రభుత్వ నియంత్రణ పెరిగిపోయిందని తెలిపింది. బలవంతపు చాకిరీ, బహిరంగ ఉరిశిక్షలు సర్వసాధారణంగా మారాయని ఆందోళన వ్యక్తం చేసింది. "ప్రస్తుత ప్రపంచంలో మరే దేశ ప్రజలు కూడా ఇంతటి కఠినమైన ఆంక్షల కింద జీవించడం లేదు" అని 14 పేజీల నివేదికను ఇచ్చింది.

అయితే, ఈ నివేదికను ఉత్తర కొరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నివేదికకు అధికారం ఇచ్చిన ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం స్పష్టం చేసింది. ఇదే సమయంలో, కొన్ని పరిమిత మెరుగుదలలు కూడా ఉన్నాయని నివేదిక గుర్తించింది. నిర్బంధ కేంద్రాల్లో గార్డుల హింస తగ్గడం, నిష్పక్షపాత విచారణకు హామీ ఇచ్చేలా కొన్ని కొత్త చట్టాలు రావడం వంటి స్వల్ప సానుకూల అంశాలను కూడా ప్రస్తావించింది.
North Korea
Kim Jong-un
North Korea human rights
foreign TV dramas
United Nations
UN human rights report
forced labor
public executions
dictatorship

More Telugu News