Srikanth Reddy: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే రియల్టర్ దారుణ హత్య

Hyderabad realtor Srikanth Reddy murdered over financial issues
  • కుషాయిగూడలో అందరూ చూస్తుండగానే దారుణం
  • ఆర్థిక వివాదాలతో వెన్నంటి ఉండే స్నేహితుడి ఘాతుకం
  • నడిరోడ్డుపై కత్తితో విచక్షణారహితంగా దాడి
  • మద్యం మత్తులో మాటామాటా పెరిగి ఘర్షణ
  • నిందితుడు ధన్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యాపారిని వెన్నంటి ఉండే స్నేహితుడే అత్యంత కిరాతకంగా, అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తిన విభేదాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన.

పోలీసుల వివరాల ప్రకారం హెచ్‌బీ కాలనీకి చెందిన పి. శ్రీకాంత్‌రెడ్డి (45) రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన వద్దే నమ్మకంగా పనిచేసే ధన్‌రాజ్ (40) అనే వ్యక్తితో కొంతకాలంగా ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయి. ఈ విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇద్దరూ మంగాపురంలోని శ్రీకాంత్‌రెడ్డి కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి గొడవ పెద్దదై, పెనుగులాటకు దారితీయడంతో ఇద్దరూ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.

పక్కా ప్రణాళికతో వచ్చిన ధన్‌రాజ్‌ వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్‌రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందారు.

సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాలింపు చర్యలు చేపట్టి నిందితుడు ధన్‌రాజ్‌ను మౌలాలి జడ్‌టీఎస్‌ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. హత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి తన భార్య అపర్ణకు ఫోన్ చేసి షాపింగ్‌కు వెళ్దామని పిలిచినట్లు తెలిసింది. అయితే, పిల్లలకు పరీక్షలు ఉన్నాయని ఆమె చెప్పడంతో ఆయన కార్యాలయంలోనే ఉండిపోయారు. ఒకవేళ షాపింగ్‌కు వెళ్లి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. 
Srikanth Reddy
Hyderabad
Real estate
Murder
HB Colony
Kushaiguda
Financial disputes
Dhanraj
Crime news
Telangana

More Telugu News