Aadhar card: ఓటరు నమోదు ప్రక్రియలో మార్పు.. 12వ ధ్రువపత్రంగా ఆధార్

Election Commission Includes Aadhaar as Voter ID Proof
  • ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు
  • గుర్తింపు పత్రాల జాబితాలోకి ఆధార్ కార్డు
  • రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈసీ నిర్ణయం
  • ప్రస్తుతం ఉన్న 11 పత్రాలకు అదనంగా ఆధార్
ఓటరు జాబితా సవరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా, ఓటరు గుర్తింపు కోసం సమర్పించే ధ్రువపత్రాల జాబితాలో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (సీఈవోలకు) స్పష్టమైన సూచనలు జారీ చేసింది.

ఓటరు జాబితా వెరిఫికేషన్ కోసం ప్రస్తుతం పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 11 రకాల డాక్యుమెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, ఈ జాబితాలో ఆధార్‌ను కూడా చేర్చాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ తాజా నిర్ణయం తీసుకుంది.

దీంతో, ఓటర్లు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి ప్రస్తుతం ఉన్న 11 పత్రాలతో పాటు, 12వ ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును కూడా వినియోగించుకోవచ్చు. దేశవ్యాప్తంగా జరిగే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) సమయంలో ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో ఓటరు నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Aadhar card
Election Commission of India
Voter list
Voter ID
Supreme Court
Election process
Voter registration
ECI
Special Summary Revision

More Telugu News