Anantapur: మంత్రి లోకేశ్ చొరవతోనే బతికి బయటపడ్డాం: అనంత దంపతులు

Nara Lokesh Helped Us Survive Say Anantapur Couple
  • నేపాల్‌లో అల్లర్లలో చిక్కుకున్న అనంతపురం యాత్రికులు
  • మంత్రి లోకేశ్ చొరవతో సురక్షితంగా స్వస్థలానికి
  • తమ బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని వెల్లడి
  • ప్రత్యేక విమానంలో 40 మందిని రేణిగుంటకు తరలింపు
  • ప్రాణభయంతో గడిపామంటూ ఆవేదన వ్యక్తం చేసిన దంపతులు
  • లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు
పుణ్యక్షేత్రాల సందర్శనకు నేపాల్ వెళ్లి, అక్కడ చెలరేగిన అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన అనంతపురం దంపతులు సురక్షితంగా స్వస్థలానికి చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ చూపడం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని వారు కృతజ్ఞతలు తెలిపారు.

వివరాల్లోకి వెళితే, అనంతపురం నగర శివారులోని కళాకారుల కాలనీకి చెందిన మల్లికార్జున, శశికళ దంపతులు ఈ నెల 4న దైవ దర్శనం కోసం నేపాల్‌కు వెళ్లారు. అక్కడ ముక్తినాథ్‌, పశుపతినాథ్‌ ఆలయాలను దర్శించుకున్న అనంతరం జనక్‌పురి వెళ్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. సుమారు 30 నుంచి 40 మంది ఆందోళనకారులు తాము ప్రయాణిస్తున్న ఏపీ బస్సుతో పాటు, మహారాష్ట్రకు చెందిన మరో రెండు బస్సులపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారని వారు తమ భయానక అనుభవాన్ని వివరించారు. ఆ సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.

దాడితో భయభ్రాంతులకు గురైన తమను డ్రైవర్ వెంటనే సమీపంలోని ఒక లాడ్జికి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఏం చేయాలో తెలియని స్థితిలో భారత ఎంబసీని సంప్రదించినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి తమతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారని దంపతులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరినీ సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

చెప్పిన మాట ప్రకారం, ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి వీరితో పాటు మరో 40 మంది యాత్రికులను గురువారం రాత్రికి తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించింది. అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో దంపతులను శుక్రవారం తెల్లవారుజామున అనంతపురంలోని వారి నివాసానికి చేర్చారు. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.


Anantapur
Nara Lokesh
Nepal
Mallikarjuna
Sasikala
AP Bus attack
Indian Embassy
Yatra
Renigunta Airport
Daggupati Venkateswara Prasad

More Telugu News