Pawan Kalyan: జగన్ అసెంబ్లీకి రావాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan demands Jagan attend Assembly
  • వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనన్న పవన్
  • ఏపీలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుపై పవన్ దృష్టి
  • తెలుగు సినిమా పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ
భారత రాజ్యాంగాన్ని గౌరవించి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. బహుశా వైసీపీకి వేరే రాజ్యాంగం ఉందేమోనని, కానీ అది తమ ప్రభుత్వంలో చెల్లదని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) క్యాంపస్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పవన్ తెలిపారు. ఈ ముఖ్యమైన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో త్వరలోనే చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు.

ఎన్ఎస్‌డీ క్యాంపస్ ఒక చిన్నపాటి భారతదేశంలా ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. తనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యమూర్తి ఈ సంస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. సమాజంలో కళలకు సరైన ప్రోత్సాహం లేకపోతే హింస పెరిగే ప్రమాదం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇండస్ట్రీకి అవసరమైన సౌకర్యాలు, రాయితీలపై తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు.

అంతకుముందు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. అపార అనుభవజ్ఞుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి మరింత గౌరవాన్ని తీసుకువస్తారని, ఆయన నేతృత్వంలో రాజ్యసభలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
YS Jagan
Andhra Pradesh Assembly
National School of Drama
Nara Chandrababu Naidu
Telugu cinema
Radhakrishnan
Deputy CM Andhra Pradesh
AP government
theatre

More Telugu News