Kethi Reddy Pedda Reddy: పెద్దారెడ్డి ఇంటికి ఆక్రమణ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్

Kethi Reddy Pedda Reddy Land Encroachment Notice Sparks Tension in Tadipatri
  • పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారుల నోటీసులు
  • ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ ఆరోపణలు
  • పెద్దారెడ్డి ఇంటి వద్ద అధికారుల సర్వే, కొలతలు
  • తాడిపత్రికి వస్తున్న పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద నిలువరించిన పోలీసులు
  • జేసీ, కేతిరెడ్డి ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు భూ ఆక్రమణ నోటీసులు జారీ చేయడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి పట్టణంలోని సర్వే నంబర్లు 639, 640, 641లో ఉన్న 10 సెంట్ల మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ స్థలం హద్దుల్లో ఉన్న పది ఇళ్లకు నోటీసులు జారీ చేశారు. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూడా ఉంది. ఇంటి స్థలానికి సంబంధించిన పత్రాలు, లింకు డాక్యుమెంట్లు తీసుకువస్తే హద్దులు నిర్ణయిస్తామని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. ఈ ఉదయం అధికారులు పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని మరోసారి సర్వే చేపట్టి, కొలతలు వేయడం ప్రారంభించారు. నోటీసులు ఇచ్చే సమయంలో పెద్దారెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన సిబ్బంది వాటిని అందుకుని, ఆయనకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంటనే తాడిపత్రికి బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం అందుకున్న పోలీసులు పెద్దారెడ్డిని పుట్లూరు వద్ద అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే తాడిపత్రిలోకి ప్రవేశించాలని అనంతపురం జిల్లా ఎస్పీ సూచించినట్లు తెలిసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు, ఆయన రాజకీయ ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అధికారుల సర్వే, పోలీసుల బందోబస్తుతో పట్టణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Kethi Reddy Pedda Reddy
Tadipatri
Anantapur district
Land encroachment
Municipal authorities
JC Prabhakar Reddy
YSRCP
Political tension
Andhra Pradesh politics
Police security

More Telugu News