Ganta Srinivasa Rao: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూసి జగన్ లో ఫ్రస్ట్రేషన్: గంటా

Ganta Srinivasa Rao Says Jagan Frustrated by Government Schemes
  • ఆయన మానసిక పరిస్థితిపై సందేహంగా ఉందన్న మాజీ మంత్రి
  • వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో జగన్ లో అసహనం
  • కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించిన గంటా శ్రీనివాసరావు
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తే వారి స్పందన ఎలా ఉంటుందో చెప్పడానికి అనంతపురంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభే నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి మాజీ సీఎం జగన్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని అన్నారు.

ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడం, మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలతో జగన్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో ఆ 11 సీట్లన్నా వచ్చాయి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవి కూడా రావని గంటా ఎద్దేవా చేశారు. తాజాగా సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభపైనా, మంత్రులపైనా జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి, హోం, వ్యవసాయ మంత్రులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యాలయాలు తప్ప ఇంకేమీ నిర్మించలేదని, నర్సీపట్నంలో వైద్య కళాశాల నిర్మాణ పనులు కేవలం 8 శాతం మాత్రమే పూర్తి చేశారని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ కోసం వెచ్చించిన రూ.500 కోట్లను మెడికల్ కాలేజీలపై పెడితే ఇప్పటికే పూర్తయ్యేవని అన్నారు. వైసీపీ పాలనకంటే రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని, ఈ విషయంపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Ganta Srinivasa Rao
Jagan Mohan Reddy
TDP
Andhra Pradesh Politics
Super Six Super Hit Sabha
YS Jagan
Telugu Desam Party
AP Assembly Elections
Government Welfare Schemes
Rushikonda Palace

More Telugu News