Samantha: నా కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలైంది: సమంత

Samantha says new chapter started in her career
  • స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కావన్న సమంత
  • రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని వ్యాఖ్య
  • ప్రపంచానికి మహిళల నాయకత్వం అవసరమన్న సామ్
స్టార్ హీరోయిన్ సమంత తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కావని, ఒక స్టార్‌గా ఉన్నప్పుడు నలుగురికి స్ఫూర్తిగా నిలవడమే అసలైన విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకుంటూ, తన కెరీర్‌లో ఓ కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, "నటీమణులకు కెరీర్ సమయం చాలా తక్కువగా ఉంటుందని నేను భావిస్తాను. స్టార్‌డమ్, గుర్తింపు లాంటివి ఉత్సాహాన్నిస్తాయి, కానీ అవేవీ శాశ్వతం కాదు. స్టార్‌గా కొనసాగుతున్నప్పుడు కనీసం కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలగాలి. ఇతరులపై ప్రభావం చూపాలని ప్రతి ఒక్కరూ స్వయంగా అనుకోవాలి," అని అన్నారు. తనకు ప్రోత్సాహం అందిస్తూ, సరైన దారి చూపే వ్యక్తులు తన చుట్టూ ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిస్తూ, "ఏ విషయంలోనైనా భయపడకుండా రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారనే విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను. మనల్ని మనం నమ్మినప్పుడే పురోగతి ఉంటుంది. దూరదృష్టి ఉన్న ప్రతి మహిళా బయటకు వచ్చి తన ఆలోచనలను పంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు వారి నాయకత్వాన్నే కోరుకుంటోంది," అని సమంత వివరించారు.

ప్రస్తుతం సమంత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థలో ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్య నిపుణులతో కలిసి హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

Samantha
Samantha Ruth Prabhu
actress
Indian actress
Shubham movie
career
inspiration
women empowerment
health podcast
film industry

More Telugu News