Smart Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. తప్పులుంటే వాట్సప్‌లోనే మార్చుకోవచ్చు

AP Ration Cards Correction via WhatsApp Says Nadendla Manohar
  • ఏపీలో ఏటీఎం కార్డు తరహాలో స్మార్ట్ రేషన్ కార్డుల జారీ
  • కార్డుల్లో తప్పులుంటే సచివాలయాల్లో సరిచేసుకునే వెసులుబాటు
  • సెప్టెంబర్ 15 నుంచి వాట్సప్‌ ద్వారా కూడా మార్పులకు అవకాశం
  • వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు తాత్కాలికంగా నిలిపివేత
  • టచ్‌స్క్రీన్, ఐరిస్ స్కానర్‌తో రేషన్ డిపోలకు కొత్త ఈ-పోస్ యంత్రాలు
ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టడమే కాకుండా, వాటిలో ఏమైనా తప్పులుంటే సులువుగా సరిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ నూతన విధానాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, కొత్తగా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత కార్డుల్లో పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు దొర్లితే గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల‌ 15వ తేదీ నుంచి 'మనమిత్ర' వాట్సప్‌ సేవ ద్వారా కూడా ఈ మార్పులు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. తప్పులను సరిచేసిన తర్వాత లబ్ధిదారులకు కొత్త కార్డులను ముద్రించి అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఆధార్, ఈ-కేవైసీ వివరాల ఆధారంగా ఈ కొత్త కార్డులను రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే, వరుసగా మూడు నెలల పాటు రేషన్ సరకులు తీసుకోని కుటుంబాలకు నాలుగో నెల నుంచి పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తారని స్పష్టం చేశారు. అలాంటి వారు తమ కార్డును సచివాలయాల్లో చూపించి తిరిగి యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ 1 తర్వాత కొత్త కార్డు కావాలనుకునే వారు రూ.35 నుంచి రూ.50 వరకు రుసుము చెల్లిస్తే, కార్డును నేరుగా ఇంటికే పంపిణీ చేస్తారని వెల్లడించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ స్మార్ట్ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు, చిరునామా, డిపో ఐడీ వంటివి తక్షణమే తెలుసుకోవచ్చు. కార్డులతో పాటు రేషన్ డిపోల్లో వినియోగించే ఈ-పోస్ యంత్రాలను కూడా ఆధునికీకరిస్తున్నారు. టచ్‌స్క్రీన్, వైఫై, బ్లూటూత్ వంటి సదుపాయాలతో పాటు వేలిముద్రలు పనిచేయని పక్షంలో ఐరిస్ (కంటిపాప) స్కాన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించే సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. ఈ నూతన విధానాలతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Smart Ration Cards
AP Ration Cards
Nadendla Manohar
Andhra Pradesh
public distribution system
QR code
Mana Mitra WhatsApp
e-KYC
ration distribution
civil supplies department

More Telugu News