CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

CP Radhakrishnan Sworn in as Vice President of India
  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 
  • హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ప్రముఖులు
  • ఇటీవలి ఎన్నికల్లో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిపై గెలుపు
  • మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి నిన్ననే రాజీనామా
  • ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి కీలక పదవికి ఎంపిక
భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు. 

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్‌ ధన్‌ఖడ్‌, వెంకయ్యనాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. రాజీనామా చేసిన తర్వాత ధన్‌ఖడ్‌ బహిరంగంగా కనపడడం ఇదే తొలిసారి.

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్‌, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్‌గా గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి ఆకర్షితులైన రాధాకృష్ణన్‌, తన 16వ ఏటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళనాడు బీజేపీలో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1998, 1999 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తన అనుచరులు ఆయన్ను ‘తమిళనాడు మోదీ’ అని పిలుచుకుంటారు. మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన జార్ఖండ్‌ గవర్నర్‌గా, తెలంగాణ ఇన్‌చార్జి గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గానూ సేవలు అందించారు.
CP Radhakrishnan
Vice President
India
Droupadi Murmu
Oath Ceremony
BJP
NDA
Venkaiah Naidu
Jagdeep Dhankhar
Tamil Nadu

More Telugu News