Jair Bolsonaro: బ్రెజిల్ రాజకీయాల్లో సంచలనం.. మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష

Former Brazilian President Bolsonaro sentenced to over 27 years in prison
  • బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష 
  • తిరుగుబాటుకు యత్నించిన కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
  • ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న బోల్సోనారో
  • తీర్పుపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తనతో పోల్చుకున్న వైనం
బ్రెజిల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. దేశంలో తిరుగుబాటుకు యత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను దోషిగా తేల్చిన సుప్రీం ఫెడరల్ కోర్టు, ఆయనకు 27 సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు బోల్సోనారోను దోషిగా నిర్ధారిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.

తిరుగుబాటుకు కుట్ర పన్నడం, ప్రజాస్వామ్య పాలనను హింసాత్మకంగా రద్దు చేసే ప్రయత్నం, సాయుధ క్రిమినల్ సంస్థలో భాగస్వామ్యం, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడం, వారసత్వ సంపదను ధ్వంసం చేయడం వంటి ఐదు కీలక అభియోగాలపై 70 ఏళ్ల బోల్సోనారోను దోషిగా తేల్చారు. జస్టిస్ కార్మెన్ లూసియా, జస్టిస్ క్రిస్టియానో జానిన్ గురువారం తమ ఓటు వేయడంతో శిక్ష ఖరారైంది. అంతకుముందే జస్టిస్ అలెగ్జాండర్ డి మోరేస్, జస్టిస్ ఫ్లేవియో డీనో కూడా ఆయనను దోషిగా పేర్కొన్నారు. అయితే, ధర్మాసనంలోని జస్టిస్ లూయిజ్ ఫక్స్ మాత్రం బోల్సోనారోను నిర్దోషిగా ప్రకటించారు.

ప్రస్తుతం బోల్సోనారో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ తీర్పుపై 11 మంది సభ్యులు గల పూర్తిస్థాయి సుప్రీం కోర్టు ధర్మాసనానికి అప్పీల్ చేసుకునే అవకాశం ఆయనకు ఉంది. విచారణ తుది దశకు ఆయన వ్యక్తిగతంగా హాజరుకాలేదు. కాగా, 2026 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా అడ్డుకునేందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బోల్సోనారో గతంలో ఆరోపించారు.

ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందని వ్యాఖ్యానించారు. "నాతో కూడా ఇలాగే చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లు అస్సలు సఫలం కాలేదు" అని ఆయన అన్నారు. గతంలో బోల్సోనారోపై విచారణను వ్యతిరేకిస్తూ, బ్రెజిల్ వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Jair Bolsonaro
Brazil
Brazil election
Donald Trump
Supreme Federal Court
Coup attempt
Political news
Latin America
Brazil politics
Bolsonaro jail

More Telugu News