YS Sharmila: నా కుమారుడే రాజశేఖరరెడ్డి వారసుడు: వైఎస్ షర్మిల

YS Sharmila My Son is YS Rajasekhara Reddys Heir
  • వైసీపీ సైతాన్‌ సైన్యం ఎంత గోలపెట్టినా, అరిచినా తన కొడుకే వైఎస్‌ఆర్ వారసుడన్న వైఎస్ షర్మిల
  • వైసీపీ వ్యాఖ్యలపై నవ్వొచ్చిందన్న షర్మిల 
  • వైఎస్ బతికుంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారన్న షర్మిల
వైసీపీపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. "వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా, అరిచినా మారేది లేదు. నా కొడుకే వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడు. ఇది ఎవరూ మార్చలేరు" అని ఆమె స్పష్టం చేశారు.

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిన్న జరిగిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కొడుకును రాజకీయాల్లోకి తెస్తున్నారని చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

"నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. అయినా వైసీపీ ఈ స్థాయిలో స్పందిస్తే... అది వాళ్ల భయమా? బెదురా? వాళ్లకే తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా నా కొడుకుకు 'రాజారెడ్డి' అని నామకరణం చేశారు" అంటూ గుర్తు చేశారు.

చంద్రబాబు చెప్పారట.. అది చూస్తే నవ్వొచ్చింది!

తన కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చేసిన వీడియో ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన షర్మిల.. “అంత కష్టపడాల్సిన అవసరమేంటి? అది చూసి నాకైతే నవ్వొచ్చింది” అని విమర్శించారు. అదే సమయంలో వైసీపీ నేతలు, చంద్రబాబు సహా తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు చెప్తే నా కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తే మరి ఎవరు చెబితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

వైఎస్ బతికుంటే జగన్ చేసిన పనికి తలదించుకునేవారు

“వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. ఆయన బతికుంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారు” అని షర్మిల అన్నారు. జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఎందుకు మద్దతివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు.

జగన్ మోదీ దత్తపుత్రుడు..

జగన్ మోదీకి దత్తపుత్రుడని, ఆయన చెప్పిందే చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ఆర్ మరణం వెనుక రిలయన్స్‌ హస్తం వుందని ఆరోపించిన జగన్.. అదే రిలయన్స్‌కు చెందిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. మోదీ కోసం అదానీకి గంగవరం పోర్టును అప్పగించారన్నారు. ఐదేళ్లూ బీజేపీ బిల్లులకు వైసీపీ మద్దతిచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ, బీజేపీకి వైసీపీ తోక పార్టీగా పని చేస్తుందని విమర్శించారు.

ధైర్యం ఉంటే బీజేపీకి తోక పార్టీ అని అంగీకరించాలి

దమ్ముంటే జగన్ వైసీపీ బీజేపీకి తోక పార్టీ అని అంగీకరించాలని, ఆ ధైర్యం లేకుంటే బీజేపీ అని చేతిమీద పచ్చబొట్టు వేసుకోండి అని సూచించారు. పొరుగు రాష్ట్రంలో బీఆర్ఎస్ న్యూట్రల్‌గా ఉందే తప్ప, ఓటు వేయలేదని, వైసీపీకి అంతటి ఇంగితం కూడా లేదని షర్మిల ఎద్దేవా చేశారు.

రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం

రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధర లేకపోవడం, రైతుల భద్రత కొరవడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయితే ప్రజలకు పథకాలు ఎందుకు అందడం లేదని ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? అని నిలదీశారు. ముమ్మాటికీ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని షర్మిల విమర్శించారు. 
YS Sharmila
YS Sharmila comments
YSR family
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh politics
Congress party
BJP alliance
farmers issues
Rajareddy

More Telugu News